సీబీఐకి కేసుల దర్యాప్తులో రాష్ట్రాల జోక్యానికి కట్టడి

కేంద్ర నేర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కి మరింత అధికారం కట్టబెట్టాలని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. రాష్ట్రాల అనుమతి తప్పనిసరి కావడంతో పలు కేసుల దర్యాఫ్తునకు ఆటంకం కలుగుతోందని, దర్యాఫ్తులో పారదర్శకత కూడా లోపిస్తోందని పేర్కొంది. అదేసమయంలో సీబీఐ అధికారుల దర్యాఫ్తు తీరుపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

అధికారుల తీరుతో కొన్ని రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయని వివరించింది. ఈ మేరకు  కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్యానెల్ తన నివేదిక సమర్పించింది. కేసుల దర్యాఫ్తులో రాష్ట్రాల జోక్యాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ ప్యానెల్ సూచించింది. రాష్ట్రాల అనుమతితో సంబంధం లేకుండా ఏ కేసునైనా విచారించే అధికారం కల్పించాలని ప్యానెల్ సభ్యులు చెప్పారు. 

సీబీఐకి ఇప్పటికే అనుమతినిచ్చిన రాష్ట్రాలు కూడా తమ అనుమతిని ఉపసంహరించు కుంటున్నాయని గుర్తుచేశారు. తొమ్మిది రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. దీంతో కొన్ని కీలక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సీబీఐకి సహకారం అందడం లేదని తెలిపారు. ఫలితంగా కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు.

ఏదైనా కేసులో సీబీఐ దర్యాప్తునకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని 1946నాటి ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం నిర్దేశిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ‘నిర్దిష్ట వర్గాల వ్యక్తులపై నిర్దిష్ట తరగతి నేరాలపై దర్యాప్తు కోసం సీబీఐకి సాధారణ సమ్మతిని మంజూరు చేస్తాయి. కానీ, దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తునకు అనుమతి సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. ఇది కీలకమైన కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి ఉన్న అధికారాలపై తీవ్రమైన పరిమితులకు దారితీసింది.. ఇది రాష్ట్రాల్లో అవినీతి, వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తుంది’ అని సిఫార్సుల్లో పేర్కొంది.
జాతీయ భద్రత, దేశ సమగ్రతకు ప్రమాదం వాటిల్లిందని భావించే కేసుల్లో రాష్ట్రాల సమ్మతితో పని లేకుండా కొత్త చట్టం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం 135వ నివేదిక స్పష్టం చేసింది. అలాగే, ఇన్‌స్పెక్టర్ సహా వివిధ ఉద్యోగ నియామకాల నిబంధనల్లో తగిన సవరణలను సీబీఐ ఇటీవల ప్రతిపాదించింది అని స్థాయీ సంఘం పేర్కొంది. మొత్తం ఉద్యోగాల్లో 60 శాతం పదోన్నతలు, మిగతా 40 శాతం డిప్యుటేషన్ లేదా నేరుగా నియమించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న రిక్రూట్‌మెంట్ విధానం ఈ పోస్టుల భర్తీకి ‘50:50’ సూత్రాన్ని అనుసరిస్తుంది