సీఎం రేవంత్ సహా 9 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి ఎ  రేవంత్ రెడ్డి సహా మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ 12 మంది మంత్రుల్లో సీఎం రేవంత్‌రెడ్డి సహా 9 మంది మంత్రులపై కలిపి మొత్తం 136 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

అందులో తీవ్రమైన క్రిమినల్‌ కేసులు 50 ఉన్నాయి. ఇక తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నట్లు ఐదుగురు మంత్రులు ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో వెల్లడించారు. కాగా, ముగ్గురు మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫారమ్స్, తెలంగాణ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు వెల్లడించాయి.

పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తర్వాతి స్థానంలో 11 కేసులతో నీటిపారుదల, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు. ఆయన తర్వాత 7 కేసులతో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, 6 కేసుల చొప్పున ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ఉన్నారు.

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులపై 5 కేసుల చొప్పున ఉండగా, ఉపముఖ్యమంత్రి  సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులపై 3 కేసులు చొప్పున ఉన్నాయి

ఇక రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం సహా మొత్తం 12 మంది మంత్రుల్లో 11 మంది కోటీశ్వరులే ఉన్నారు. రూ.433.93 కోట్ల విలువైన ఆస్తులతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అత్యధికంగా ఆస్తులు ఉన్న మంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు. 10 మంది మంత్రులు తమకు అప్పులు ఉన్నాయని ప్రకటించగా, అప్పుల జాబితాలోనూ రూ.43.53 కోట్లతో మంత్రి పొంగులేటి టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. రూ. 82.83 లక్షల ఆస్తులతో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అత్యల్ప ఆస్తులున్న మంత్రిగా ఉన్నారు.