పశుసంవర్థకశాఖలో ఫైల్స్ మాయం

తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఆఫీసులో ఫైల్స్ అదృశ్యం అయ్యాయనే వార్త కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఆఫీసులో ముఖ్యమైన ఫైల్స్ మాయమైనట్లు అధఇకారులు గుర్తించారు. పశుసంవర్థక శాఖ ఆఫీసు కిటీకీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్ చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. 
ఆఫీసులో పేపర్లు చిందరవందరగా పడిఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు పశుసంవర్థకశాఖ అధికారులు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు. దస్త్రాలు అదృశ్యంపై పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ను డీసీపీ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఫైల్స్ మాయంపై తమకు ఎటువంటి సమాచారం లేదని డైరెక్టర్‌ అంటున్నారు. 
 
సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని, కిటీకీ గ్రిల్స్ తొలగించారని అధికారులు పోలీసులకు తెలిపారు. ఆఫీసులో కొన్ని ఫైల్స్ కావాలనే చింపినట్లు ఉందన్నారు. తలసాని ఓఎస్డీ కల్యాణ్‌, ఎలిజ, మోహన్‌, వెంకటేశ్‌, ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

కాగా, పశుసంవర్థకశాఖ ఆఫీసులో ఫైల్స్‌ చోరీపై వస్తున్న వార్తలు అవాస్తమని తలసాని ఓఎస్డీ కల్యాణ్ అంటున్నారు. మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందించామని చెబుతున్నారు. ప్రభుత్వం మారడంతో, ఫర్నిచర్‌, ఇతర సామగ్రి జీఏడీకి అప్పగించేందు మాసబ్‌ ట్యాంక్‌ లోని ఆఫీసుకు వెళ్లినట్టు పేర్కొంటున్నారు.

 మరోవంక, బషీర్‌బాగ్‌ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో కొందరు దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. ఆటోలో ఫైళ్లను ఎత్తుకెళ్లేందుకు ఆగంతుకులు ప్రయత్నించారు. అయితే.. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్‌ ఉండటం గమనార్హం. 
 
అయితే, ఆటోలో ఫైళ్లు తరలించడాన్ని అధికారులు గమనించి అడ్డుకున్నారు. దీంతో అధికారులను చూసిన దుండగులు ఫైల్స్‌తో ఉన్న ఆటోను వదిలిపోయారు. ఈ ఘటనపై అధికారులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆటోలో ఉన్న ఫైల్స్ ఎవరివి? ఎక్కడివి?ఎక్కడికి తరలిస్తున్నారు? అనేది తెలుసుకుంటున్నారు.