కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించానని, ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. వైద్యం కోసం అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరానని తెలిపారు. 

ప్రజాపాలనలో కేసీఆర్ సలహాలు, సూచనలు తీసుకుంటామని చెబుతూ కేసీఆర్ ఆరోగ్యంపై మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్యులను ఆదేశించామని చెప్పారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. 

అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో భేటీ అయ్యారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం వైద్య, ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీని యశోద ఆస్పత్రికి పంపించారు.

కాగా, ఫాంహౌజ్ లో గురువారం అర్ధరాత్రి బాత్ రూమ్ లో కేసీఆర్ కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు యశోద ఆస్పత్రి వైద్యుల బృందం హిప్ ప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స తర్వాత తొలిసారి వైద్యులు శనివారం నడిపించారు. వైద్యుల సూచనలతో వాకర్‌ సాయంతో కేసీఆర్ మెల్లగా అడుగులు వేశారు.

కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను వీడియో సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో పోస్టు చేసింది. తుండి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్‌ ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకుంటారని చెప్పారు. కేసీఆర్ మానసికంగా దృఢంగా ఉన్నారని, మరో రెండు మూడు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.