ధీరజ్ సాహు నోట్ల కట్టలు పార్లమెంట్ ఎన్నికల కోసమే!

జార్ఖండ్‌కి చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు వ్యాపారాలపై జరుగుతున్న ఐటీ సోదాల్లో ఇప్పటికి పెట్టుబడిని రూ. 290 కోట్ల మేరకు అక్రమ సంపాదన నోట్ల కట్టలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ సేకరిస్తున్నవే అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్త్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు.
 
దేశ చరిత్రలో ఆదాయ పన్ను అధికారుల దాడుల్లో ఒకే చోట ఇంత పెద్ద అక్రమ సంపాదన బయట పడడం తొలిసారి అంటూ ఈ ఖ్యాతి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇక్కడ దొరికిన డబ్బులను లెక్కించే యంత్రాలు వేడెక్కి మొరాయిస్తున్నాయి తప్పితే లెక్కించడం పూర్తికావడం లేదని తెలిపారు. రాంచీలోని 8 బ్యాంకుల్లో లాకర్స్ ఉన్నాయని గుర్తించి ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారని చెప్పారు. 
 
కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏ రకంగా ఉందో ఈ విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చని పేర్కొంటూ కర్ణాటకకు చెందిన డబ్బును తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పంచిందని ఆరోపించారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి, అవినీతికి విడదీయలేని బంధం ఉందని స్పష్టం చేశారు.
 
ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అనుచరుడు ధీరజ్ సాహు అని చెబుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ధీరజ్ సాహు అన్ని ఏర్పాట్లు చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు జరిగితే రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శిస్తారని, కానీ ధీరజ్ సాహు అక్రమ సంపాదనపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. 
 
ఆ డబ్బు ఎవరిదో రాహుల్ గాంధీ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కూడబెడుతున్న నోట్ల గుట్టల్లా ఉన్నాయని అంటూ ఓడిపోయిన వ్యక్తిని మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపిందని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో రూ. 12లక్షల కోట్ల అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. 
 
 ఆ సమయంలో ప్రతి రోజు కాంగ్రెస్ కుంభకోణాలే కనిపించాయని పేర్కొంటూ కాంగ్రెస్ హయాంలో 2జీ, బొగ్గు వంటి అనేక కుంభకోణాలు జరిగాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ వ్యక్తులు తీహార్ జైల్లో ఉన్నారని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లుగా నీతివంతమైన పాలన అందిస్తోందని అంటూ దేశానికి ఇస్తున్న గ్యారంటీ మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. 
 
రాహుల్ గాంధీకి ధీరజ్ సాహు వంటి అవినీతిపరులు ఎంత మంది సన్నిహితులు ఉన్నారో చెప్పాలని కిషన్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో కుంభకోణాలకు పాల్పడిన ఆమ్ ఆద్మీ, తృణమూల్ పార్టీలు అత్యంత సన్నిహితమైనవని ఎద్దేవా చేశారు. ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి దేశ ప్రజలు మూడోసారి పట్టం కడుతారని  కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.