మాయావతి రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ఆదివారం కీలక ప్రకటన చేశారు. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ తన రాజకీయ వారసుడని వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సన్నాహాల కోసం లక్నోలో ఆదివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా 28 ఏళ్ల మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌ను తన రాజకీయ వారసుడిగా నియమించారు. బీఎస్పీని బలోపేతం చేసే బాధ్యత కూడా ఆకాష్‌కు అప్పగించారు. 
కాగా, మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కుమారుడే ఆకాష్‌ ఆనంద్‌. గత ఏడాది నుంచి బీఎస్పీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.  2019లో సోదరుడు ఆనంద్‌ కుమార్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా, మేనల్లుడు ఆకాష్‌ ఆనంద్‌ను జాతీయ కోఆర్డినేటర్‌గా మాయావతి నియమించారు. అయితే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పార్టీకి మాయావతి అధ్యక్షత వహిస్తారని బీఎస్పీ నేత ఉదయ్‌వీర్ సింగ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ కేడర్‌కు ఆకాష్‌ ఆనంద్‌ నాయకత్వం వహిస్తారని చెప్పారు.

గత సంవత్సరం నుండి రాజస్థాన్‌లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా కూడా ఆకాష్‌ ఆనంద్‌ వ్యవహరించారు. అంతకుముందు.. 2019లో మాయావతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆగస్టు నుంచి లక్నోలో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశానికి ఆకాష్ ఆనంద్ హాజరు కావడం, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో అతని స్థాయిని ఏంటో నిరూపించేందుకు మరో ఉదాహరణగా నిలిచింది. 

అదే నెలలో.. పార్టీ నిర్వహించిన 14 రోజుల ‘సర్వజన్ హితయ్, సర్వజన్ సుఖయ్ సంకల్ప్ యాత్ర’కి నాయకత్వం కూడా వహించారు. నిజానికి 2019లో ఆకాశ్ ఆనంద్‌ని ఉపాధ్యాక్షుడిగా మాయావతి ప్రకటించినప్పుడు ఆమె నెపోటిజం విమర్శలను ఎదుర్కొవడంతో స్వయంగా ఆనంద్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 

అప్పుడు మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించగా, ఆకాష్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు. ఆ ఏడాదిలోనే (2019లో) మాయావతిపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచార నిషేధాన్ని విధించినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమికి మద్దతివ్వాలని ప్రజలను ప్రోత్సహిస్తూ ఆకాష్ ఆనంద్ తన మొదటి రాజకీయ ర్యాలీలో ప్రసంగించారు.

అయితే బహుజన సమాజ్ పార్టీ అధికారికంగా ఈ నిర్ణయం తెలియచేయలేదు. కానీ పార్టీ కార్యవర్గ సభ్యులు ఉదయ్‌వీర్ సింగ్ మాయావతి జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో బిఎస్‌పి ఎన్నికల రాజకీయాలలో పలు పరాజయాలు పొందుతూ వచ్చింది. కానీ ఈ పార్టీకి సామాజికంగా రాజకీయంగా తగువిధమైన ప్రాబల్యం ఉంది.

బిఎస్‌పిని పటిష్టం చేసే బాధ్యతను ఆకాశ్‌కు తమ నాయకురాలు అప్పగించినట్లు సింగ్ వెల్లడించారు. ఇటీవల జరిగిన బిఎస్‌పి అఖిల భారత స్థాయి సమావేశంలో ఆనంద్‌కు ఈ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారని వివరించారు.