కాంగ్రెస్ ఎంపీ కంపెనీలో రూ.351 కోట్లు జప్తు

కట్టల కట్టల డబ్బు.. లెక్కపెట్టలేక మొరాయించిన కౌంటింగ్‌ మెషీన్లు.. ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల సందర్భంగా అధికారులకు ఎదురైన అనుభవమిది. కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ, ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై జరిగిన ఈ దాడుల్లో నగదు కట్టలు కట్టలు బయటపడ్డాయి.
 
పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తూనే ఉంటారు. అయితే ఐటీ శాఖ చరిత్రలోనే ఒకేసారి చేసిన దాడుల్లో అత్యధిక సొమ్ము బయటపడింది. ఐదు రోజులుగా సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకున్న డబ్బును అధికారులు లెక్కించారు. మొత్తం పట్టుబడ్డ నగదు 351 కోట్ల రూపాయలని అధికారులు ప్రకటించారు. ఆదాయపన్ను శాఖయే కాదు, ఏ ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఏకదాడిలో ఇంత పెద్దమొత్తంలో అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకోవడం దేశంలో ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. 
 
గతంలో 2019లో కాన్పూర్‌ కేంద్రంగా ఉన్న ఒక వ్యాపార సంస్థపై జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు దాడి చేసి 257 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దేశంలో అదే పెద్ద మొత్తం. అలాగే తమిళనాడులో ఒక నిర్మాణ సంస్థపై ఐటీ అధికారులు 2018లో దాడి చేసి రూ.153 కోట్లను పట్టుకున్నారు. ఈ రికార్డులన్నీ ఒడిశా ఐటీ దాడితో తుడిచిపెట్టుకుపోయాయి.
 
అది కూడా ఓ కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో దొరకడంతో రాజకీయంగా తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.  ఈ నెల 6న ప్రారంభమైన ఐటీ దాడులు ప్రధానంగా బల్దేయో సాహు ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న బౌద్ధ్‌ డిస్టిలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీడీపీఎల్‌)పై కొనసాగాయి. కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూకు చెందిన రాంచి, ఇతర ప్రదేశాల్లోని సంస్థలపై కూడా దాడులు జరిగాయి. అయితే వాటి నుంచి ఎంత నగదు, ఏం పత్రాలు స్వాధీనం చేసుకున్నారో ఐటీ అధికారులు ఇంకా వెల్లడించ లేదు.
 
అయితే డబ్బుల లెక్కింపు పూర్తి కాలేదని, ఇంకా కొనసాగుతోందని అధికారులు ఆదివారం వెల్లడించారు.  బౌద్ధ్ డిస్టిలరీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే ఆరోపణలపై ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారు. పట్టుబడిన డబ్బు అంతా దేశవ్యాప్తంగా ఆ సంస్థ, డిస్ట్రిబ్యూటర్లు, ఇతరులు నిర్వహించిన నగదు అమ్మకాల ద్వారా వచ్చిందని.. అయితే అది లెక్కల్లోకి రాని మొత్తం అయి ఉండొచ్చని ఐటీ అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ ప్రసాద్‌ సాహు డిస్టిలరీ సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. దీంతో రాంచీలోని ధీరజ్ ప్రసాద్ సాహు ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు భారీ ఎత్తున సోదాలు చేపట్టారు. అయితే ధీరజ్ ప్రసాద్ సాహు వద్ద ఎంత నగదు, ఏం పత్రాలు స్వాధీనం చేసుకున్నారనేది ఇంకా అధికారులు వెల్లడించలేదు.

అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కంపెనీలో భారీ ఎత్తున నగదు పట్టుబడటం రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తీవ్ర అవినీతి ఆరోపణలు గుప్పిస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం కూడబెట్టుకున్న నోట్ల కట్టలుగా పలువురు బిజెపి నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

 
అయితే ఈ ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే బదులిచ్చింది. ధీరజ్‌ సాహు వ్యాపారాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన ఆస్తులతో పాటు ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు గుర్తించిన నగదు గురించి సాహు మాత్రమే వివరణ ఇవ్వాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.
 
ఇలా ఉండగా, ధీరజ్‌ సాహూ సంస్థల్లో పెద్దయెత్తున నల్లధనం పట్టుబడిన క్రమంలో ఆయన గత ఏడాది ఆగస్టు 12న నల్లధనంపై చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌లో ఆ పాత పోస్ట్‌ను ఉంచారు.
 
‘పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా ఇంత పెద్ద యెత్తున నల్లధనం, అవినీతి చూస్తే నాకు బాధేస్తున్నది. అసలు ఇంత పెద్ద మొత్తంలో నల్లధనాన్ని ఎందుకు పోగేసుకుంటున్నారో నా మస్తిష్కానికి అందడం లేదు. ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే ఈ అవినీతిని కూకటి వేళ్లతో పెకిళించగలదు’ అని ఎంపీ ధీరజ్‌ సాహూ గతంలో ట్వీట్‌ చేశారు.