ఒక న్యాయమూర్తిగా చట్టానికి, రాజ్యాంగానికి సేవకుడిని

ఒక న్యాయమూర్తిగా తాను చట్టానికి, రాజ్యాంగానికి సేవకుడినని, వాటిలో పొందుపరిచిన నిబంధనల ప్రకారమే తాను నడుచుకోవలసి ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు.  శుక్రవారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే సిజెఐ చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎందుట న్యాయవాది మాథ్యూస్ జె నెడుంపరా ఒక అంశాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చారు. 

కొలీజియం విధానంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని, అదే విధంగా సీనియర్ న్యాయవాది అన్న హోదాను రద్దు చేయాలని న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీనిపై సిజెఐ చంద్రచూడ్ స్పందిస్తూ మీ మనసుకు నచ్చిన విషయాలను అనుసరించే స్వేచ్ఛ మీకు ఉందని, కాని ఒక భారత ప్రధాన న్యాయమూర్తిగా, ముఖ్యంగా తొలుత ఒక న్యాయమూర్తిగా చట్టానికి, రాజ్యాంగానికి తాను సేవకుడినని తెలిపారు. 

వీటిలో నిర్దేశించిన నిబంధనలను తాను పాటించవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇది నాకు నచ్చింది కాబట్టి చేస్తానని నేను చెప్పలేను అంటూ ఆయన తెలిపారు. న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ల హోదా ఉండడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఒక పిటిషన్‌ను ఈ ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు కొట్టివేసింది.  న్యాయవాది నెడుంపరతోపాటు మరో ఏడుగురు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేఋత్వంలోని ధర్మాసనం తీర్పు చెబుతూ సీనియర్ అడ్వకేట్ అన్న హోదా కోర్టు ప్రతిభకు ఇచ్చిన గుర్తింపుగా అభివర్ణించారు.

‘మీ మనస్సాక్షి చెప్పిన విధంగా స్వేచ్ఛగా వ్యవహరించే హక్కు మీకుంది. అయితే భారత ప్రధాన న్యాయమూర్తిగా, మరీ ముఖ్యంగా ఒక న్యాయమూర్తిగా తొలుత నేను చట్టానికి, రాజ్యాంగానికి సేవకుడిని’ అని చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ‘నాకు నిర్దేశించిన స్థాయిని నేను అనుసరించాలి. నాకిదే ఇష్టం.. నేనిదే చేస్తాను అని చెప్పలేను’ అని ఆయన తెలిపారు.

ఇలా ఉండగా, న్యాయమూర్తుల ఖాళీలు భారీగా పెరిగిపోతున్నప్పటికీ, నియామకాలు సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంటున్నప్పటికీ, ఈ నియామకాల్లో అంతిమంగా ఎవరి నియంత్రణ ఉండాలనే విషయంలో నిరంతర పోట్లాట జరుగుతున్నదని తి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (సీఏటీ) ముంబై బెంచ్‌కు నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో కేసుల విచారణలో జాప్యాన్ని నివారించడంలో, న్యాయ సేవలు అందించడంలో ట్రైబ్యునళ్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.