అవి గోమూత్ర కాదు.. గోముద్ర రాష్ట్రాలు

అవి గోమూత్ర కాదు.. గోముద్ర రాష్ట్రాలు
ఉత్తరాది రాష్ట్రాలు గోముద్ర‌కు సంకేతమ‌ని, గోమూత్రానికి కాదు అని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ డా. త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ స్పష్టం చేశారు. అహ్మాదాబాద్‌లోని గుజ‌రాత్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన క‌ల్చ‌ర‌ల్ ఎకాన‌మీ కాన్‌క్లేవ్‌లో ఆమె మాట్లాడుతూ ఇటీవ‌ల లోక్‌స‌భ‌లో డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ ఉత్త‌రాది రాష్ట్రాల‌ను గోమూత్ర రాష్ట్రాలంటూ వాఖ్యలు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చెప్పారు.

తాను త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన వ్య‌క్తిని అని, కొంద‌రు ఉత్త‌ర‌-ద‌క్షిణ రాష్ట్రాల మ‌ధ్య వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, త‌మిళ‌నాడుకు చెందిన ఓ ఎంపీ ఆ వ్యాఖ్య‌లు చేయ‌డం బాధ క‌లిగించిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఉత్త‌రాది రాష్ట్రాలు ప‌విత్ర‌కు సంకేతమైన గోముద్ర రాష్ట్రాలు అని, అవి గోమూత్ర రాష్ట్రాలు కాదు అని ఆమె చెప్పారు. ఇలాంటి విభ‌జ‌న ఉండ‌వ‌ద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

పురాత‌న కాలంలో త‌మిళ ప్ర‌జ‌లు త‌మ ఇండ్ల‌ల్లో దేవుడి ముందు హూండిని పెట్టుకుని దాంట్లో రోజు డ‌బ్బులు వేసేవాళ్లు అని, జ‌మ అయిన ఆ సొమ్ముతో కాశీ యాత్ర చేసేవాళ్లు అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై తెలిపారు. దేశ ప్ర‌జ‌లు ఆధ్మాత్మికంగా ఒక్క‌టై ఉన్నార‌ని, కానీ ప్రాంతీయంగా వాళ్ల‌ను వేరు చేయ‌డం స‌రికాదు అని ఆమె హితవు చెప్పారు. 

ప్ర‌జ‌ల్ని ఎలా విభ‌జిస్తారని ఆమె ప్రశ్నించారు. ఆధ్యాత్మికంగా ఒక్క‌టయ్యార‌ని, రాజ‌కీయంగా కొంద‌రు విభ‌జ‌న చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, కానీ వాళ్లు ప్ర‌య‌త్నాలు ఏమీ ఫ‌లించ‌వ‌ని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే అంద‌రూ ఆధ్యాత్మికంగా ఒక్క‌టై ఉన్న‌ట్లు ఆమె తెలిపారు.

త‌మిళ‌నాడులో కాశీ, రామేశ్వ‌రంను ప్ర‌జ‌లు వేరువేరుగా చూడ‌ర‌ని, కాశీ వెళ్లిన వారు రామేశ్వ‌రం వెళ్తార‌ని, అలాగే రామేశ్వ‌రం వెళ్లిన వాళ్లు కాశీకి ఆధ్యాత్మిక పర్యటన చేస్తార‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై గుర్తు చేశారు. ఉత్త‌రాది-ద‌క్షిణాది మ‌ధ్య అగాధాన్ని పెంచ‌వ‌ద్దని ఆమె అభ్యర్ధించారు. కాశీ ప‌ట్ట‌ణం ఉత్త‌రంలో ఉంద‌ని, త‌మిళ‌నాడులో టెన్‌కాశీ ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. 

మ‌న సంస్కృతులు ఒక్క‌టి కావ‌డం వ‌ల్ల‌ మ‌న‌ల్ని ఎవ‌రూ విడ‌దీయ‌లేర‌ని ఆమె స్పష్టం చేశారు.  బ‌ల‌మైన సాంస్కృతిక వ్య‌వ‌స్థ అవ‌స‌ర‌మ‌ని చెబుతూ గ‌డిచిన 100 ఏండ్ల‌లో దేశ‌వ్యాప్తంగా సుమారు 20 వేల ఆల‌యాలు ధ్వంసం అయ్యాయ‌ని, ఇప్పుడు అలాంటి ఆరాధ్య కేంద్రాల‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. 

గుజ‌రాత్‌లోని పావ‌గ‌ద్ కొండ‌ల్లో ఉన్న శ్రీ కాళికామాత ఆల‌యాన్ని ఇటీవ‌ల పున‌ర్ నిర్మించిన‌ట్లు ఆమె తెలిపారు. ఆల‌యాల పున‌ర్ నిర్మాణం వ‌ల్ల స్థానిక ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంద‌ని ఆమె చెప్పారు.  ఆల‌యాన్ని ఓసారి రెనోవేట్ చేస్తే, అప్పుడు అక్క‌డికి భ‌క్తులు వ‌స్తార‌ని, ఆల‌యాల పున‌ర్ నిర్మాణంపై దృష్టి పెట్టాల‌ని గవర్నర్ తెలిపారు. 

 కాళీమాత ఆల‌యాన్ని పున‌ర్ నిర్మించ‌డానికి ముందు రోజూ 5వేల మంది భ‌క్తులు అక్క‌డికి వచ్చేవార‌ని, ఇప్పుడు ప్ర‌తి రోజూ 80 వేల మంది వ‌స్తున్న‌ట్లు ఆమె తెలిపారు. కిసాన్ కార్డుల త‌రహాలో యాత్ర‌కుల కార్డులు ఇవ్వాల‌ని, దాని వ‌ల్ల హోట‌ళ్ల‌లో లేదా పూజా ప్ర‌దేశాల్లో ప్రాధాన్యత వ‌చ్చేలా చూడాల‌ని ఆమె సూచించారు.