
పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తినందుకు బహుమతులు, నగదు స్వీకరించినందుకు దోషిగా తేలిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ శుక్రవారం బహిష్కరించింది. డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగారన్న కేసులో ఆమెకు వ్యతిరేకంగా నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ శుక్రవారం చర్చించింది.
ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ 500 పేజీల నివేదకలో ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించారు. నివేదికను లోక్‌సభ ఆమోదించడంతో ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే ఈ విషయమై మాట్లాడేందుకు మొయిత్రాకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపక్ష సభ్యులు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. ఆమెకు తన వాదనను వినిపించుకునే అవకాశాన్ని కమిటీ ఇచ్చిందని చెప్పడంతో ఆమె సభనుండి బైటకు వెళ్లారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మోయిత్రాను బహిష్కరించే తీర్మానాన్ని పెట్టగా ప్రతిపక్ష సభ్యులు వాక్ అవుట్ జరపగా, మూజువాణి ఓటుతో దానిని ఆమోదించారు. ఆ తర్వాత లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సుదీర్ఘమైన ఈ నివేదికను చదివి చర్చలో పాల్గొనేందుకు సభ్యులకు అవకాశం కల్పించేందుకై నాలుగైదు రోజుల తర్వాత చర్చ చేపట్టాలని మొదట్లో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజాన్ చౌదరి కోరారు.
కేవలం ఒక సభ్యురాలి ప్రవర్తన కారణంగా భారతదేశ ఎంపిలను అంతర్జాతీయంగా ప్రతికూల ధోరణిలో చూస్తున్నారని బిజెపి ఎంపీ హీనా వి గవిట్ ఆందోళన వ్యక్తం చేశారు. మనం పార్లమెంటరీ వ్యవహారాలను అనుసరించడం అవసరమని తెలిపారు. తోలుత, ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం సభ తిరిగి సమావేశమైనప్పుడు ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకర్ ప్యానెల్ మొదటి నివేదికను సమర్పించారు.
తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్‌కు చెందిన కొందరు వెల్ ఆఫ్ ద హౌస్‌లో బైఠాయించి నివేదిక కాపీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
అంతకుముందు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి కళ్యాణ్ బెనర్జీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తూ, పార్టీ ఎంపి మహువా మోయిత్రాను బహిష్కరించాలని సిఫార్సు చేస్తూ ఎథిక్స్ ప్యానెల్ నివేదికను చదవడానికి కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని కోరారు.
లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడంపై మహువా మొయిత్రా పార్లమెంటు వెలుపల నిప్పులు చెరిగారు. బహిష్కరించే హక్కు ఎథిక్స్ కమిటీకి లేదని ఆమె స్పష్టం చేశారు. ఇది మీ (బీజేపీ) ముగింపునకు ఆరంభం అంటూ ఆమె ఘాటుగా విమర్శించారు.
“ఈ ప్రభుత్వం నన్ను బహిష్కరించడం ద్వారా అదానీ సమస్యను దూరం చేయగలదని అనుకుంటే, ఈ కంగారూ కోర్టు భారతదేశం మొత్తానికి ఆ తొందరపాటు దుర్వినియోగాన్ని మాత్రమే చూపించిందని నేను మీకు చెప్తాను. మీరు ఉపయోగించిన ఈ పక్రియ అదానీ మీకు ఎంత ముఖ్యమైనవారో చూపిస్తుంది. ఒంటరి మహిళా ఎంపీని లొంగదీసుకోమని వేధించడానికి మీరు ఎంత వరకైనా వెళతారు.” అంటూ ఆమె విమర్శలు కురిపించారు.
కాగా, మహువా మొయిత్రాపై నిషాకాంత్ దూబే చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ 500 పేజీల నివేదికను నవంబర్ 9న ఆమోదించింది. మెయిత్రా అభ్యంతకరమైన, అనైతిక, నేర ప్రవర్తనకు పాల్పడ్డారని, ఆమెను 17వ లోక్‌సభ నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫారసు చేసింది. 6:4 మెజారిటీతో తీర్మానాన్ని కమిటీ ఆమోదించింది. పారిశ్రామికవేత్త హీరానాందనాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై నవంబర్ 2న ఎథిక్స్ కమిటీ ముందు మెయిత్రా హాజరై తన వాదనను వినిపించారు.
More Stories
పాకిస్తాన్ నటుడి సినిమాపై కేంద్రం నిషేధం
వేయి మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20 వేల బలగాలు
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష