తెలంగాణలో మరో రెండు నెలల్లో పంచాయతీ ఎన్నికలు!

బొటాబొటి మెజారిటీతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న ఎ రేవంత్ రెడ్డికి ఒకవంక పరిపాలనపై పట్టు సాధిస్తూ, ఎన్నికల హామీలను అమలు పరచడంతో పాటు వరుసగా ఎన్నికలను ఎదుర్కొని పార్టీ సత్తా ప్రదర్శించడం సవాల్ గా మారనుంది. మరో నాలుగైదు నెలల్లో లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉండగా, ఈ లోపుగానే పంచాయతీ ఎన్నికలు వచ్చి మీద పడనున్నాయి.
 
మరో రెండు నెలల్లో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు  ఎన్నికల కమిషన్ పేర్కొంది. 2024 జనవరి 31తో ముగియనున్న సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనుంది.  ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది.
 
ఈ క్రమంలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల వివరాల కోసం జిల్లా వారీగా ఎన్నికల సంఘం నివేదికను కోరింది. సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్‌కు పంపించారు. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగియడంతో ఎన్నికల కసరత్తును ప్రారంభించారు. తెలంగాణలో 12వేల గ్రామపంచాయతీలు, లక్షా పదమూడు వేలకు పైగా వార్డులు ఉన్నాయి.
 
అయితే పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇప్పటికే ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడం, త్వరలోనే కొత్త శాసనసభ కొలువుదీరనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించారు. 
 
ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల నియామకం, ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రారంభించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం అశోక్ కుమార్ పేరుతో డిసెంబర్ 4న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.