11 మంది మంత్రులతో కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

* ఇనుప కంచెలు బద్దలు కొట్టాం – రేపట్నుంచే ప్రజాదర్భార్
* రేవంత్ రెడ్డికి ప్రధాని శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత ఎనుముల రేవంత్‌ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్‌బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ రేవంత్‌ రెడ్డితో మధ్యాహ్నం 1.20నిమిషాలకు  ప్రమాణం చేయించారు.  ముఖ్యమంత్రితో పాటు మరో 11మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
 
ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. ఆ తర్వాత మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఎం ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా, ఎంపీ  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కొండా సురేఖ, దనసరి అనసూయ, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
మంత్రుల్లో దామోదర్ రాజనరసింహ ఒక్కరే ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత రేవంత్‌ రెడ్డి భార్యతో కలిసి సోనియాకు పాదాభివందనం చేశారు. తన కుమార్తె, అల్లుడిని సోనియా, రాహ‍ుల్‌, ప్రియాంకలకు పరిచయం చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఆయ‌న‌కు కంగ్రాట్స్ తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ ఇస్తున్నట్లు ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో తెలిపారు. 
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.  రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ఎల్‌బి స్టేడియం కాంగ్రెస్‌ కార్యకర్తలు, రేవంత్‌ రెడ్డి అభిమానులతో నిండిపోయింది.
 
ఆరు గ్యారంటీ పథకాలపై తొలి సంతకం
 
ఎల్బీ స్టేడియం వేదికగా తొలి సంతకం రెండు ఫైళ్లపై రేవంత్ రెడ్డి చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు సంతకం చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుని  హోదాలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి తొలి హామీ ఇచ్చారు.  ఇందుకు తగ్గటే ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్ ముఖ్యమంత్రి హోదాలో రజినీకి తొలి ఉద్యోగం ఇస్తూ సంతకం చేశారు.

పాలకులం కాదు సేవకులం అన్నట్లుగా పని చేస్తామని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డి చెప్పారు. “ప్రగతి భవన్ వద్ద ఉన్న ఇనుప కంచెలను బద్ధలు కొట్టించాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాటిస్తున్నాను. నా తెలంగాణ కుటుంబ ప్రజలు ఎప్పుడు రావాలనుకున్నా… ప్రగతి భవన్ లోకి రావొచ్చు. ప్రజలు వారి ఆలోచనలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు” అని ప్రకటించారు. 

జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో శుక్రవారమే  ప్రజాదర్భార్ నిర్వహిస్తానని వెల్లడించారు.  ఇందిరమ్మ రాజ్యంలో సోనియామ్మ అండతో ప్రజలకు మేలైన సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసి చూపిస్తామని హామీ ఇచ్చారు. పాలకులం కాదు సేవకులం అనే విధంగా పని చేస్తానని చెబుతూ కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

“పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది” అని చెప్పారు. 

“రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా… ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.