తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణీస్వీకారం చేయగా,  స్పీకర్ పదవి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేసింది.  రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదన చారికి అవకాశం దక్కగా, 2018లో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు. 
 
తెలంగాణలో కాంగ్రెస్ కు తొలిసారి అధికారం దక్కగా గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పదవి దక్కినట్లు అయింది. గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇయన వికారాబాదు జిల్లా మర్పల్లి గ్రామంలో జన్మించారు. తాండూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 
2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇక 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎ.చంద్రశేఖర్‌ పై(టీఆర్ఎస్) 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు.2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మెతకు ఆనంద్ పై పోటీ చేసి వికారాబాద్ స్థానం నుంచి గెలిచారు.