ఆడుదాం – ఆంధ్ర: ఎన్నికల లబ్ది కార్యక్రమమా?

“ఆడుదాం – ఆంధ్ర” పేరుతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఈవెంట్ రాష్ట్ర చరిత్రలోనే మెగా టోర్నీగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు చెప్పుకుంటున్నారు. యువతను క్రీడలవైపు ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన సమాజం వైపు నడిపించడంపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఇప్పుడున్న యువతరం ఆటలు అంటే మొబైల్‌ ఫోన్‌లో ఆటలే అనే పరిస్థితి ఏర్పడింది. పోటీ ప్రపంచంలో మెజారిటీ విద్యార్థులకు, యువతకు ఆటలు దూరమై చాలాకాలం అవుతుంది. అంతేకాక డ్రగ్స్‌కు, ఇతర చెడు అలవాట్లకు యువత బలి అవుతుంది. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న గ్రామీణ, సంప్రదాయ క్రీడలను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలి. ఈ దిశగానే చిత్తశుద్దితో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఖచ్చితంగా అభినందించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రచార అర్భాటానికే టాప్ ప్రయార్టీ ఇస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
“ఆడుదాం ఆంధ్ర” పేరుతో 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 26 వరకు గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగా.. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఈ పోటీలకు గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో తగిన ఆటస్థలాలు లేవు. మరి ఎక్కడ క్రీడా పోటీలను నిర్వహిస్తారన్నదే పశ్న. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు గ్రామ స్థాయి నుంచి క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, క్రీడా సామగ్రిని సమకూర్చిన తరువాత ఆడుదాం ఆంధ్రను నిర్వహిస్తే బాగుండేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ సొమ్ముతో నిర్వహిస్తున్న ఈ పోటీలు కేవలం ఓ స్టంట్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళు దాటుతోంది. మరో మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. కానీ ఈ నాలుగున్నరేళ్ళలో ఏనాడూ క్రీడలకు సరైన ప్రోత్రాహం గానీ, మౌలిక సదుపాయాల కల్పనపై గానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టిన దాఖలాలే లేవు. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఎక్కడా విద్యార్థులు, యువతలో క్రీడల ప్రోత్సాహానికి మైదానాల ఏర్పాటు, క్రీడా పరికరాల కొనుగోలు వంటివే జరగలేదు. కానీ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో, మీడియాలో ప్రకటనలతో ఆడుదాం ఆంధ్ర అంటూ విపరీతమైన హడావుడి చేయటం.. యువతను తప్పుదోవ పట్టించే వ్యూహంలో భాగమని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి.
వాస్తవానికి క్రీడల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది. అనేక చోట్ల క్రీడా మైదానాలు కబ్జాకు గురైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లోనే సరైన మైదానాలు అందుబాటులో లేవు. ఇక మారుమూల గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నా నాడు నేడులో ఒక్కటంటే ఒక్క క్రీడా మైదానాన్ని కూడా బాగు చేసిన పాపాన పోలేదు. సీఎం పుట్టిన రోజున సీఎం కప్పు పేరుతో క్రీడలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు తప్ప నేటికీ ఆ  పోటీల నిర్వహణకు సంబంధించిన నిధులు ఇవ్వలేదు. దీంతో పిల్లల చార్జీలు, ఇతర ఖర్చులు పీడీలు, పీఈటిలే భరించారు. ఇంకొన్ని చోట్ల విద్యార్థులే భరించాల్సిన పరిస్థితి వచ్చింది.
అంతెందుకు.. గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలు ఇప్పటివరకు అరకొరగా చెల్లించింది. ఇందులో స్వర్ణపతకానికి రూ.5 లక్షలు, రజత పతకం రూ.4 లక్షలు, క్యాంస్య పతకం సాధించిన వారికి రూ.3 లక్షల రూపాయల చొప్పున అందించాలి. జీవోలు ఇచ్చారు తప్ప నగదు చెల్లించకపోవడంతో శాప్‌ కార్యాలయం చుట్టూ క్రీడాకారులను ప్రదక్షిణలు చేయిస్తున్నారు. మరి ఈ ఏడాది గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రోత్సాహకాలు ఎప్పుడిస్తారో ఎవరికీ తెలియదు.
ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో  క్రీడాకారులను ప్రోత్సహించడం, వారికి అత్యుత్తమ శిక్షణ అందించటం కోసం శాప్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తన బాధ్యతలను మరిచిన “శాప్” పక్కా వ్యాపార సంస్థగా మారిపోయింది. యువతీ, యువకులు క్రీడలు నేర్చుకోవాలని ప్లే గ్రౌండ్‌కు వస్తే గంటల చొప్పున రేటు నిర్ణయించారు. క్రీడా మైదానాలను, స్టేడియాలను, స్విమ్మింగ్‌ ఫూల్‌, జిమ్‌ సెంటర్లను నిర్వీర్యం చేసేందుకు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. అంతేకాదు పలు ప్రాంతాల్లో మహిళా క్రీడాకారులను వేధించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నగదు ప్రోత్సాహకాల కోసం వచ్చిన వారిని కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం, సామగ్రి కొనుగోలులో అవినీతి ఆరోపణలొస్తున్నాయి.
ఇటీవల కాలంలో శాప్‌లో కోచ్‌ల రిక్రూట్మెంట్‌ లేదు. పర్మినెంటు కోచ్‌లు పట్టుమని పదిమంది కూడా లేరు. ఉన్న కోచ్‌లకు, సిబ్బందికి కనీస వేతనాలివ్వడం లేదు. గత ఐదు నెలలుగా శాప్‌లో వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా తీసుకున్న కోచ్‌లకు వేతనంగా కేవలం  19వేల 500, సాధారణ జూనియర్ కోచ్‌లకు వేతనంగా రూ.15 వేలు నిర్ణయించారు. అది కూడా సుమారు 5 నెలలుగా జీతాలు చెల్లించటం లేదు. కోచ్‌లకు సైతం కనీస జీతాలు చెల్లించని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయల దుబారా చేయటం ఏంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీని వెనుక ఏపీలో క్రీడల అభివృద్ది కాకుండా.. రాజకీయ ప్రచార ఆర్భాటమే ఎక్కువగా ఉందని జనం ఆరోపిస్తున్నారు. దీనికి అధికార వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతరాని ప్రశ్నిస్తున్నారు.