అన్నదాత వెన్ను విరిచిన పెనుతుఫాన్

మొన్నటివరకు సాగునీరు లేక కటకట.. నేడు తీవ్ర తుఫాన్ తో వేసిన పంటంతా నీటిపాలు.. ఏపీలో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మిగ్‌జాం తుపాను.. ఆంధ్ర రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంటను మింగేసింది. కళ్లముందే కళ్లాల్లోని పంటంతా నీటిపాలైంది. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినటం వల్ల సుమారు 7 వేల కోట్ల రూపాయల వరకు పంట నష్టం జరిగినట్టు ప్రాధమిక అంచనాలు చెబుతున్నాయి. 8 జిల్లాల పరిధిలోని 60కు పైగా మండలాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తుఫాను కారణంగా కురిసిన భారీవర్షాలతో.. లక్షలాది ఎకరాల్లో వరి, పత్తి, శనగ, మినుము, పొగాకు, మొక్కజొన్న, జూట్‌, పసుపు పంటలు.. పూర్తిగా నీటమునిగాయి. ఇటు పెనుగాలులకు అరటి, కంది, బొప్పాయి, మునగ చెట్లు నేలకూలాయి. కల్లాల్లో ధాన్యంపై పట్టాలు కప్పినా, బస్తాలకు ఎత్తిన ధాన్యం కూడా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొంతవరకు ధాన్యాన్ని మిల్లులకు తరలించినా.. చాలాచోట్ల క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడం.. గన్నీ బ్యాగ్‌లు, రవాణా సౌకర్యం లేనిచోట్ల ధాన్యమంతా ఈ వర్షాలకు తడిచిపోయింది. భారీ వర్షాలకు కోనసీమ జిల్లాలో ఖరీఫ్‌ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విజయనగరం, ఉభయగోదావరి, అన్నమయ్య, కడప జిల్లాల్లోని చాలాచోట్ల పొగాకు, మిర్చి, వరి, మినుము, కంది తదితర పంటలు నీళ్లలో మునిగిపోయాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కోత దశకు వచ్చిన 90 శాతం పంట చేతికందకుండా పోయింది. దీంతో ఎటు చూసినా పొలాల్ని చుట్టేసిన వరద.. వాననీటిలో తేలుతున్న వరి కుప్పలు.. చెమ్మ చేరి దెబ్బతింటున్న ధాన్యం.. కన్నీరుమున్నీరవుతున్న రైతన్నలు.. తీర ప్రాంత జిల్లాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి కృష్ణాబేసిన్ లో ఈ సారి నీటి లభ్యత సున్నా. ఆశించిన వర్షపాతం లేకపోవడం.. ఎగువరాష్ట్రాల నుంచి నీటి రాక తగ్గడంతో.. కృష్ణమ్మ పరవళ్లు శ్రీశైలం దగ్గరే ఆగిపోయాయి. దీంతో నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఆయకట్టుకు ఈ సారి సాగునీటి కష్టాలు వచ్చిపడ్డాయి. కరువ పరిస్థితులు కళ్లముందే కనిపించాయి. దీంతో పంట విస్తీర్ణం గతంకంటే చాలా తక్కువైంది. వేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డాయి. కానీ.. మిగ్‌జాం తుపాను బీభ్సతంతో ఇన్నాళ్లూ పడ్డ కష్టం నీటిపాలైపోయింది. ఎలాగోలా పంటచేతికొస్తుందన్న ఆశలు.. ఆవిరయ్యాయి. ఆరుగాలం పడ్డ కష్టమంతా కన్నీళ్లైపోయి.. ఆవేదనే మిగిలింది. ఇటు ఆక్వా రైతును కూడా మిగ్‌జాం తుఫాన్ తీవ్ర నష్టాల పాలు చేసింది. వాతావరణంలో మార్పులతో పాటు.. తుపాను ప్రభావంతో ఆక్సిజన్ తక్కువ కావడంతో.. రొయ్యలు బతకలేకపోయాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆక్వా రైతుల కష్టం కూడా నీటిపాలైంది. మిగ్‌జాం తుపాను ఇటు అన్నాదతలను, అటు ఉద్యానవన పంటలను, మరోవైపు ఆక్వా రైతులను కోలుకోలేని నష్టాలను మిగిల్చింది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వరి రైతులకు అపార నష్టం వాటిల్లింది. తీవ్ర తుపాను ప్రభావంతో.. రాష్ట్రంలో కోత దశకు వచ్చిన వరిలో 90% నేలవాలింది. వెంటనే నీరు బయటకు పోయినా.. పంట నష్టం తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కోత ఖర్చులు పెరగడంతోపాటు ధాన్యం రంగు మారి ధర పడిపోతుందని వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు విజ్ణప్తి చేస్తున్నారు.