అన్న ప్రసాదం పంపిణీలో ఇంత నిర్లక్ష్యమా..?

ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో సామాన్య భక్తుల పట్ల టీటీడీ చూపిస్తున్న వివక్ష, స్వామి వారి ప్రసాదం పంపిణీలో చూపిస్తున్న తీవ్ర నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వీఐపీల సేవలో తరిస్తున్న టీటీడీ అధికారులు.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వరనే అపప్రదను మూటగట్టుకున్నారు. స్వామి వారికి వచ్చే హుండీ, విరాళాల రూపంలో వచ్చే ఆదాయంలో 90 శాతం సామాన్య భక్తుల నుంచే వస్తున్నప్పటికీ.. వారి పట్ల టీటీడీ అధికారులు, సిబ్బంది చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

వాస్తవానికి తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రపంచంలో మరే దేవాలయానికి లేనన్ని ఆస్తులు ఉన్నాయి. భక్తులు కానుకల రూపంలో ఇచ్చే సొమ్ముతో శ్రీవారి ఆస్తుల మొత్తం విలువ 2.26 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. 11 వేల కేజీల బంగారు, వెండి, వజ్రాభరాణాలు, 16 వేల కోట్ల రూపాయలకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఏటా 2 వేల కోట్ల రూపాయల హుండీ ఆదాయం వస్తోంది. దీనికి వసతి గృహాలు, ఆర్జిత సేవలు, లడ్డూ, ప్రసాదాల విక్రయాలు, డిపాజిట్లపై వడ్డీ, స్థిర, చర ఆస్తులపై అద్దెలు, వివిధ ట్రస్టుల ద్వారా సేకరిస్తున్న విరాళాల ద్వారా వస్తున్న ఆదాయం కలిపితే సుమారు 4 వేల కోట్ల రూపాయాల మార్కును దాటుతోంది. 2023-24 సంవత్సరానికి 4 వేల 411 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌ను టీటీడీ ఆమోదించింది.

టీటీడీలో సుమారు 6500 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 13 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరి వేతనాలకై ఏటా సుమారు 1600 కోట్ల రూపాయలకు పైగా టీటీడీ ఖర్చు చేస్తోంది. టీటీడీ వార్షిక బడ్జెట్‌లో దాదాపు సగ భాగం ఉద్యోగులు, అధికారుల జీతాలకే ఖర్చు చేస్తున్నారు. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం.. ట్రస్ట్ బోర్డు అనుభవించే సకల సదుపాయాల దగ్గర నుంచి ఉద్యోగుల జీత భత్యాల వరకు ప్రతీ పైసా భక్తులు సమర్పించే కానుకల నుంచే చెల్లిస్తున్నారు. కానీ, అటువంటి భక్తులకు అందించాల్సిన వసతి, సదుపాయాల విషయంలో మాత్రం టీటీడీ తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వసతి భవనాల్లో రూమ్స్ కేటాయింపు దగ్గర నుంచి ఆర్జిత సేవలు, దర్శనాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ విక్రయాల వరకు.. అన్ని విషయాల్లో సామాన్య భక్తులను టీటీడీ అనామకుల్లా ట్రీట్ చేస్తోంది.

తాజాగా శ్రీవారి నిత్యన్నదాన ప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న ప్రసాద పంపిణీలో భాగంగా.. టీటీడీ నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. ఉడికీ..ఉడకని అన్నాన్ని, కూరలను భక్తులకు వడ్డించింది. దీంతో ఆ అన్నప్రసాదాన్ని తినలేక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులంటే.. టీటీడీకి ఇంత చిన్న చూపా..? అంటూ నిలదీశారు. ఏది పడితే.. అది పెడితే తినటానికి..? తమని పశువులు అనుకుంటున్నారా..? అంటూ నిప్పులు చెరిగారు. అయితే.. ఇప్పుడే కాదు.. టీటీడీ అందించే అన్న ప్రసాదం, అల్పాహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదనే ఆరోపణలు చాలా కాలం నుంచే ఉన్నాయి. అన్న ప్రసాదం తయారీకై ముడిసరుకు కొనుగోలుకు.. కాగితాల్లో చూపించే లెక్కలకు.. వాస్తవంగా ఉండే క్వాలిటీకి నక్కకు, నాగ లోకానికి ఉన్న తేడా కనిపిస్తోంది. తాము ఏం పెట్టినా.. భక్తులు నోరు మూసుకుని తినాలి.. అనే భావన టీటీడీలో పెరిగి పోవటంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

వాస్తవానికి తిరుమల శ్రీవారి నిత్యన్నదాన ట్రస్టుకు 600 కోట్ల రూపాయలకు పైగా విరాళాల రూపంలో వచ్చిన డిపాజిట్లు ఉన్నాయి. ఏటా 40 కోట్ల రూపాయల వరకు దీనిపై వడ్డీ వస్తుండగా.. నిత్యాన్నదాన పథకానికి 60 నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతోంది. అయితే.. వడ్డీగా వచ్చే ఆదాయం పోనూ.. మరో 40 నుంచి 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే భక్తులకు అత్యుత్తమమైన అన్న ప్రసాదాన్ని టీటీడీ అందించ వచ్చు. కానీ.. భక్తుల కానుకల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పటికీ.. వారికి సరైన అన్నప్రసాదం అందించటానికి టీటీడీ అధికారులకు చేతులు రావటం లేదు. దీంతో.. నాసిరకమైన అన్న ప్రసాదాన్నే భక్తులకు పంపిణీ చేస్తోంది.

అయితే.. టీటీడీ బోర్డు, సిబ్బందిలోనూ అవినీతి పెరిగి పోవటం, అన్యమతస్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతో.. శ్రీవారి భక్తులకు సరైన సదుపాయాలు అందటం లేదనే భావన వ్యక్తం అవుతోంది. కానుకల రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయం అందిస్తున్న సామాన్య భక్తుల పట్ల టీటీడీ చిన్నచూపు చూడటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇకనైనా టీటీడీ పాలకవర్గం తన లోపాలను సవరించుకుని సామాన్య భక్తులకు మెరుగైన సదుపాయాలను, ప్రసాదాలను అందించాలనే డిమాండ్ బలంగా వ్యక్తం అవుతోంది.