తెలంగాణ‌లో 82 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు

* అత్యంత సంప‌న్న ఎమ్మెల్యే గ‌డ్డం వివేక్

తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 82 మంది ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు ఏడీఆర్ వెల్ల‌డించింది. సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు 59 మంది ఎమ్మెల్యేల‌పై ఉన్న‌ట్లు తెలిపింది. ఈ వివ‌రాలను అభ్య‌ర్థుల ఆఫిడ‌విట్‌ల ఆధారంగా వెల్ల‌డించిన‌ట్లు ఏడీఆర్ పేర్కొంది.  2018 ఎన్నిక‌ల ఆఫిడ‌విట్‌ల‌ను ప‌రిశీలిస్తే 73 మంది ఎమ్మెల్యేల‌పై మాత్ర‌మే క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి. 
ప్ర‌స్తుతం ఒక ఎమ్మెల్యేపై హత్య కేసు ఉండ‌గా, ఏడుగురిపై హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోదైన‌ట్లు వెల్ల‌డించింది. ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌పై మ‌హిళల‌ను వేధించిన కేసులు న‌మోదు అయ్యాయి.  కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేల్లో 51 మంది క్రిమిన‌ల్ కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి 19, బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒక‌రు, ఎంఐఎం నుంచి న‌లుగురు ఎమ్మెల్యేలపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్ల‌డించింది. 
సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసుల విష‌యానికి వ‌స్తే.. కాంగ్రెస్ నుంచి 31 మంది, బీఆర్ఎస్ నుంచి 17 మంది, బీజేపీ నుంచి ఏడుగురు, సీపీఐ నుంచి ఒక‌రు, ఎంఐఎం నుంచి ముగ్గురు ఉన్నారు.  అయితే వారిలో 16 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ ఉద్యమం, మోడల్ కోడ్ నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి కేసులు ఉన్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రకటించింది.
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. తరువాత ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుపై 52 క్రిమినల్ కేసులు ఉన్నాయి.  ఇక మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ సాగర్ రావుపై 32, హ్యాట్రిక్ విజయం సాధించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై 89 కేసులు ఉన్నాయి.
కరీంనగర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల కమలాకర్ పై 10 క్రిమినల్ కేసులు, గజ్వేల్ నుంచి ఎన్నికైన కేసీఆర్ పై 9, సిరిసిల్ల నుంచి రెండోసారి ఎన్నికైన కేటీఆర్ పై 8 అలాగే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై 6 కేసులు ఉన్నాయి.
 
కాగా, తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేల ఆస్తులు కోటికి పైగానే ఉన్న‌ట్లు ఏడీఆర్ నివేదిక వెల్ల‌డించింది. ఈ 114 మంది ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గ‌డ్డం వివేక్(కాంగ్రెస్) నిలిచార‌ని ఏడీఆర్ తేల్చింది. 2018 ఎన్నిక‌ల్లో 106 మంది కోటీశ్వ‌రులుగా ఉండ‌గా, ఇప్పుడు ఆ సంఖ్య 114కు చేరింది. 
 
కాంగ్రెస్ పార్టీ నుంచి 60 మంది, బీఆర్ఎస్ నుంచి 38 మంది, బీజేపీ నుంచి 8 మంది, సీపీఐ నుంచి ఒక‌రు, ఎంఐఎం నుంచి గెలిచిన ఏడుగురు కూడా కోటీశ్వ‌రుల జాబితాలో ఉన్నారు.  చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గ‌డ్డం వివేక్ రూ. 606 కోట్ల‌తో తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌థ‌మ స్థానంలో నిలిచారు.  మునుగోడు నుంచి గెలుపొందిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రూ. 458 కోట్ల‌తో రెండో స్థానంలో ఉండ‌గా, పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 433 కోట్ల‌తో మూడో స్థానంలో ఉన్నారు.
ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు రూ. 24 ల‌క్ష‌ల‌తో అతి త‌క్కువ ఆస్తులు క‌లిగిన ఎమ్మెల్యేగా న‌మోదు అయ్యారు.  దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ నేనావ‌త్ రూ. 28 ల‌క్ష‌లు, అశ్వ‌రావుపేట ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ జాడే రూ. 56 ల‌క్ష‌ల‌ను క‌లిగి ఉన్న‌ట్లు ఏడీఆర్ నివేదిక వెల్ల‌డించింది. ఇక ఐటీఆర్ చెల్లిస్తున్న వారిలో ప్ర‌థ‌మ‌స్థానంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, రెండో స్థానంలో గ‌డ్డం వివేక్, మూడో స్థానంలో కేటీఆర్ ఉన్నారు.