పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. భారత్‌లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్‌ చేసినట్లు తెలిపారు. రెండు ‘నయా కశ్మీర్’ బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.  జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ముకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో మాట్లాడుతూ జమ్ముకశ్మీర్‌లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లులు న్యాయం చేస్తాయని తెలిపారు. 
 
కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47కు పెంచినట్లు చెప్పారు. అలాగే జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43కు పెంచినట్లు వివరించారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) కూడా మనదేనని, అందుకే ఆ ప్రాంతంలో 24 సీట్లు రిజర్వ్‌ చేసినట్లు వెల్లడించారు.  కాగా, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కారణంగా జమ్మకశ్మీర్ రెండు తప్పుల్ని చవిచూసిందని అమిత్ షా ఆరోపింఛాయారు. ఒకవేళ నెహ్రూ సరైన చర్యలు తీసుకొని ఉండుంటే పీఓకే ఇప్పుడు భారత్‌లో భాగమై ఉండేదని, ఇదొక చారిత్రాత్మక తప్పిదని సభలో ఉద్ఘాటించారు.

‘‘రెండు పొరపాట్ల కారణంగా జమ్ముకశ్మీర్ తీవ్రంగా నష్టపోయింది. మొదటిది.. పాక్‌తో యుద్ధంలో మన సైన్యం గెలుస్తున్నప్పుడు ‘కాల్పుల విరమణ’ విధించడం. ఒకవేళ మరో మూడు రోజుల పాటు ఆ యుద్ధాన్ని కొనసాగించి, ఆ తర్వాత సీజ్‌ఫైర్‌కి పిలుపునిచ్చి ఉంటే.. పీఓకే మన దేశంలో భాగమై ఉండేది. ఇక రెండోది.. మన అంతర్గత సమస్యను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లడం’’ అని అమిత్ షా పేర్కొన్నారు. 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద సంఘటనలు చోటు చేసుకోకుండా చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోందని చెబుతూ 2026 నాటికల్లా ఆ విషయంలో విజయం సాధిస్తామని హోమ్ మంత్రి వెల్లడించారు.  ఈ బిల్లులపై చర్చకు సమాధానమిస్తూ సొంత దేశంలోనే బలవంతంగా శరణార్థులుగా మారేందుకు ప్రేరేపించబడిన బాధితులకు న్యాయం చేసేందుకు ఈ బిల్లులు ప్రయత్నిస్తాయని తెలిపారు. 

ఎవరైతే విస్మరించబడ్డారో, అవమానించబడ్డారో  వారికి తమ హక్కులు అందించడమే ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశమని అమిత్ షా లోక్‌సభలో స్పష్టం చేశారు. ఏ సమాజంలోనైనా అణగారిన వారిని ముందుకు తీసుకురావాలని, అదే ప్రాథమిక అంశమని చెప్పారు. అయితే, వారి గౌరవం దెబ్బతినకుండా ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. 

హక్కులు ఇవ్వడానికి, గౌరవప్రదంగా హక్కులు ఇవ్వడానికి చాలా తేడా ఉందని పేర్కొంటూ  కాబట్టి బలహీనమైన, అణగారిన వర్గానికి బదులుగా వెనుకబడిన వర్గమని పిలవడం ముఖ్యమని తెలిపారు.  పేదల బాధ ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమైందని అమిత్ షా తెలిపారు. 

‘‘కొంతమంది చిన్నచూపు చూసే ప్రయత్నం చేశారు. పేరు మాత్రమే మారుస్తున్నారని ఎవరో అన్నారు. కాస్త సానుభూతి ఉంటే.. ఆ పేరుకు గౌరవం దక్కేలా చూడాలి అని వారందరికీ చెప్పాలనుకుంటున్నాను. తమ్ముళ్లలా భావించి ముందుకు తీసుకురావాలనుకునే వారికే ఇది కనపడుతుంది. పేద కుటుంబంలో పుట్టి పెద్దన్నగా మారిన నాయకుడు నరేంద్ర మోదీ. నేడు దేశ ప్రధాని అయ్యారు. ఆయనకు పేదల బాధలు తెలుసు’’ అని అమిత్ షా చెప్పుకొచ్చారు.

కాగా, లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లుల్లో ఒకటి జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ చట్టం 2004ని సవరించాలని కోరింది. ఇది  షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సామాజికంగా & విద్యాపరంగా వెనుకబడిన తరగతుల సభ్యులకు వృత్తిపరమైన సంస్థలలో నియామకం, ప్రవేశాలలో రిజర్వేషన్లు కల్పిస్తుంది. 

ఇక రెండోది, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో కొత్త సెక్షన్లైన 15ఎ, 15బిలను చొప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ బిల్లు ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది సభ్యులను నామినేట్ చేయకూడదు. ఆ ఇద్దరిలో ఒకరు ‘కశ్మీరీ వలసదారుల’ సంఘం నుండి.. మరొకరు ‘నిర్వాసితులైన వ్యక్తుల నుండి ఒక సభ్యులై ఉండాలి.