చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌

చంద్రయాన్‌ -3 ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ కక్ష్యను విజయవంతంగా మార్చామని ఇస్రో మంగళవారం ప్రకటించింది. చంద్రుడి కక్ష్య లో ఉన్న మాడ్యూల్‌ ను భూకక్ష్యలోకి తీసుకొచ్చే అరుదైన ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది. ఇందుకు గాను ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్‌-ఎర్త్‌ ఉత్తేజిత ప్రక్రియ వినియోగించినట్లు తెలిపింది.   

జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జిటిఒ) నుండి చివరి చంద్ర ధ్రువ వృత్తాకార కక్ష్యకు ల్యాండర్‌ మాడ్యూల్‌ను మార్చడం, ఉద్దేశించిన విధంగా విభజనను విజయవంతంగా సాధించడం ద్వారా ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ (పిఎం) ప్రధాన లక్ష్యం నెరవేరిందని ఇస్రో వెల్లడించింది. విభజన తరువాత ఇస్రో పిఎం లోపల హాబిటబుల్‌ ప్లానెట్‌ ఎర్త్‌ (ఎస్‌హెచ్‌ఎపిఇ) పెలోడ్‌ స్పెక్ట్రోపోలారిమెట్రీని నిర్వహించిందని ప్రకటించింది.

భవిష్యత్తులో చంద్రుడిపై ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్టులకు అవసరమైన సమాచారం అందించడానికి వీలుగా చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్ ను మళ్లీ భూ కక్ష్యలోకి మార్చారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా నిర్దేశించిన ప్రధాన విధులను ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది.

భూ స్థిర కక్ష్య నుంచి చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంలోని చంద్ర కక్ష్యలోనికి విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ ను తీసుకువెళ్లడం, ఆ తరువాత ఇస్రో ఆదేశాలకు అనుగుణంగా ల్యాండర్ మాడ్యూల్ ను తన నుంచి విడదీసి చంద్రుడి ఉపరితలంపైకి పంపించడం.. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధులు. వాస్తవానికి ఎంపి మిషన్‌ను మూడు నెలల ఆపరేషన్‌ కోసం నిర్ణయించారు. 

ఒక నెల కంటే ఎక్కువ సమయం మాత్రమే పనిచేయడంతో 100 కిలోల ఇంధనం మిగిలిపోయిందని తెలిపింది.  తనలో మిగిలి ఉన్న అదనపు ఇంధనాన్ని వినియోగిస్తూ ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడిపై ఇస్రో చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు అవసరమైన సమాచారం అందిస్తుంది. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి నుంచి 1.54 లక్షల కిమీల దూరంలో భూ కక్ష్యలో పరిభ్రమిస్తోంది.

అయితే, దీనివల్ల ఆ కక్ష్యలో ఉన్న ఇతర సాటిలైట్స్ కు ఎలాంటి ముప్పు ఉండదని ఇస్రో తెలిపింది.  ప్రపంచ దేశాలకు సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 మిషన్‌ని ప్రయోగించి ఇస్రో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ ఏడాది జులై 14న ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగాన్ని చేయగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపింది. 

జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు జరిపి అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని భూమికి పంపించాయి. 14 రోజుల తర్వాత ‘స్లీపింగ్ మోడ్’లో వెళ్లింది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఫలితం దక్కలేదన్న విషయం తెలిసిందే.