తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి

తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటనపై రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్టు అధిష్ఠాన నిర్ణయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా ముందు ప్రకటించారు. 
 
తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ భేటీలో అందిన తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని వెల్లడించారు. డిసెంబరు 7న ఆయన ప్రమాణం స్వీకారం చేస్తారని తెలిపింది. వంత్‌ రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.
 
సీఎం అభ్యర్థి ప్రకటన వెలువడే కంటే కొద్ది సమయం ముందే రేవంత్ రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు రావటంతో హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన మార్గ మధ్యలో ఉన్న సమయంలోనే హస్తినలో కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన చేశారు.  దేశ రాజధానిలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ఉదయం జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారు.
పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పరిశీలకుడు- కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాకరే ఈ భేటీలో పాల్గొన్నారు. 
ఢిల్లీలో మకాం వేసి ముఖ్యమంత్రి పదవికోసం చివరి ప్రయత్నాలు చేసిన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో మల్లికార్జున ఖర్ వారితో వేర్వేరుగా మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 
 
కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి ఆయన మూడో ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తొలిసారిగా ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే విషయంలో సీనియర్ నేతలను కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా ఒప్పించగలిగిందనేది చర్చనీయాంశమవుతోంది.  తొలుత రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి పంచాలనే ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు.
 
 తొలి రెండున్నర సంవత్సరాలు దళిత ముఖ్యమంత్రి లేదా అగ్రవర్ణ సీఎం, చివరి రెండున్నర సంవత్సరాలు అటు ఇటుగా మార్చాలనే ప్రతిపాదన వచ్చిందని సమాచారం.  దీనికి మల్లికార్జున ఖర్గే గానీ, రాహుల్ గాంధీ గానీ పెద్దగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సీటు షేరింగ్ పరిస్థితే వస్తే పొరుగునే ఉన్న కర్ణాటకలోనూ అదే డిమాండ్ వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అంటున్నారు.
 
దీనికి బదులుగా భట్టి విక్రమార్క‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి అంగీకరించారు వారిద్దరూ.  కీలకమైన శాఖలు ఆయన ఆధీనంలో ఉండేలా కేబినెట్‌లో నంబర్ టూగా భావించే హోం మంత్రిత్వ శాఖను తనకే అప్పగించాలని భట్టి ప్రతిపాదించగా దీనికి సూచనప్రాయంగా అంగీకరించారని సమాచారం.
పాతకాపులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు కీలకమైన, ప్రాధాన్యత గల మంత్రిత్వ శాఖలను అప్పగించాలనే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కేబినెట్‌లో తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
 
హోం, ఆర్థికం, జల వనరులు, విద్యుత్, మున్సిపాలిటీలు.. ఇలా కొన్ని ప్రాధాన్యత శాఖలను వారికి అప్పగించాల్సి ఉంటుందనే డిమాండ్ పెట్టారని చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యత గల కార్పొరేషన్లను తాము సూచించిన వారికి, తమ అనుచరులకు ఇవ్వాలని డిమాండ్ చేశారని, దీనికి కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించిందని అంటున్నారు.