మిచౌంగ్ తుఫాన్‌ తాకిడికి చెన్నై అతలాకుతలం

మిచౌంగ్ తుఫాన్‌ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నై సహా పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సోమవారం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు రావటంతో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. 
 
చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరదనీరు చేరింది. దీంతో విమాన రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. 16 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు. పదుల సంఖ్యలో విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి వరకు విమానాశ్రయంలో విమాన రాకపోకల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
 
రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో చెన్నై పోలీసు విభాగం, విపత్తు పునరుద్ధరణ విభాగం సహాయ చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడులో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
 
గత 70-80 ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షం కురిసిందని ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.ఎన్‌ నెహ్రూ తెలిపారు. తుపాన్‌ విలయం ముందు తమ ప్రభుత్వం విఫలమైందని ఆయన చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా అవి చాలలేదని ఆయన పేర్కొన్నారు. చెంగల్పట్లు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది.
 
2015నాటి తుఫాన్‌ విపత్తును గుర్తుకుతెస్తూ చెన్నైలో మిజ్‌జాం బీభత్సం సృష్టించింది. రోడ్డపై పెద్దయెత్తున వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. రాజధాని చెన్నైతోపాటు పలు జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు, బ్యాంకులకు మంగళవారం సెలవు ప్రకటించారు.

ఏపీలో కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న మిగ్‌జాం తుఫాను మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటుతుందని అధికారులు పేర్కొన్నారు.  తుఫాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది.  తుఫాను తీరం దాటే సమయంలో భారీ విధ్వంసం ఉంటుందని దివిసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను అప్రమత్తతపై కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తెలంగాణాలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కు భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.