పార్లమెంట్‌ సమావేశాల ముందుకు 19 బిల్లులు!

ఈ నెల 4 నుంచి 22 వరకు దాదాపు 19 రోజులపాటు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది.  మోదీ 0.2 ప్రభుత్వానికి ఇవే చివరి శీతాకాల సమావేశాలు కావడం గమనార్హం.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ, టిఎంసి నేతలు సుదీప్ బందోపాధ్యాయ్, డెరిక్ ఒ బ్రియాన్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ( ఎన్‌సిపి) నేత ఫౌజియా ఖాన్ సహా 23 పార్టీల నేతలు హాజరయ్యారు.
 
సమావేశం అనంతరం మంత్రి ప్రహ్లాద్ జోషీ విలేఖరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపైనచర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే సభలో చర్చలకు అనువైన వాతావరణం ఉండేలా చూడాలని ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునుంచి జరగనున్న ఈ సమావేశాలపై ఆ రాష్ట్రల ఫలితాల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది.
ఈ సెషన్‌లో 19 బిల్లులను, రెండు ఆర్థిక అంశాలకు సంబంధించిన విషయాలు సభలో చర్చించనున్నట్లు జోషీ తెలిపారు.  పేదల కోసం అనేక పథకాలను తీసుకువచ్చాం… అయిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన చివరి సెషన్ ఇది. నిర్మాణాత్మక చర్చ జరిగేలా తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందని కోరారు. 
 
 కాగా చైనా మన భూభాగాన్ని లాగేసుకోవడంపైన, మణిపూర్ హింస. ధరల పెరుగుదల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్( ఇడి), కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ల దుర్వినియోగంపైన సమావేశంలో ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసినట్లు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు ప్రమోద్ తివారీ చెప్పారు.  బిల్లుల్లో జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2023, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు ఉన్నట్లు తెలుస్తున్నది.  
 
జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లతో సెషన్స్‌లోనే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ లాస్‌ (ప్రత్యేక నిబంధనలు) రెండో (సవరణ) బిల్లును సైతం ప్రవేశపెట్టనున్నది. చట్టం చెల్లుబాటును 2026 డిసెంబర్‌ 31 వరకు పొడిగించాలని కోరింది. 
 

తాత్కిలిక పన్నుల సేకరణ బిల్లు-2023, కేంద్ర వస్తువులు-సేవల పన్నులు (రెండో సవరణ) బిల్లు, సెంట్రల్‌ యూనివర్సిటీ (సవరణ) బిల్లు, తెలంగాణలో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ, బాయిలర్స్‌ బిల్లు సైతం పార్లమెంట్‌ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తున్నది. వీటితో పాటు ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లను ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు తీసుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ప్రస్తుతం పెండింగ్‌లో 37 బిల్లు ఉండగా 12 వరకు చర్చించనున్నట్లు సమాచారం. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లుపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ‘కఠోరమైంది’గా పేర్కొంది. ఆగస్టులో వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో ఆమోదించారు. 

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్‌ల నియామకం, వేతనం, తొలగింపుపై కేంద్రానికి నియంత్రణను ఇచ్చే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్‌ల (నియామకం, సేవా నిబంధనలు మరియు పదవీకాలం) బిల్లుపై సైతం పార్లమెంట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.