విశ్రాంత జడ్జీల గుప్పిట్లో ఆర్బిట్రల్‌ వ్యవస్థ

విశ్రాంత న్యాయమూర్తులపై ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ మధ్యవర్తిత్వ వ్యవస్థను రిటైర్డ్‌ జడ్జీలు బిగించిన పిడికిల మధ్య ఉంచారని విచారం వ్యక్తం చేశారు. ఇతర అర్హత కలిగిన వ్యక్తులకు అవకాశం నిరాకరించడంతో ఇది ఓల్డ్‌ బాయ్స్‌ క్లబ్‌లా ఉందని చీఫ్‌ జస్టిస్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ వ్యవస్థలో సంస్కరణలు అత్యవసరమని ఆయన సూచించారు.
 
ఇలా మధ్యవర్తిత్వ వ్యవస్థను విశ్రాంత న్యాయమూర్తులు గుప్పిట్లో పెట్టుకోవడం ప్రపంచంలోని ఏ దేశంలోనే లేదని, ఇది మనదేశంలోనే అధికమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్‌ కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ మధ్యవర్తిత్వ ప్రక్రియ న్యాయపరమైన అడ్డంకుల నుంచి ఇబ్బంది పడకుండా ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా భారత దేశంలోని మధ్యవర్తిత్వ వ్యవస్థపై దేశంలో న్యాయవ్యవస్థ రూపురేఖలను మార్చివేస్తున్న చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధైర్యమైన వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.  సోదర న్యాయమూర్తుల గురించి ఈ విధమైన వాఖ్యలు చేయడం సహోసేపతమని కొనియాడారు. అవసరమీయతే ఓ చట్టం ద్వారానైనా ఆత్మ విశ్లేషణ చేసుకొని ఈ వ్యవస్థలో మార్పు తీసుకు రావాల్సిన సమయం ఆసన్నమైనదని ఆయన పిలుపిచ్చారు.

`ఓల్డ్ బాయ్స్ క్లబ్’ అనే అపనింద నుండి మన న్యాయవ్యవస్థ ముందుకు వెళ్లాలంటే ఇందులో అందరికి సమాన అవకాశాలు లభించేటట్లు చూడాల్సిందే అని స్పష్టం చేశారు. భారతదేశంలో అర్హత గల మానవ వనరులు విశేషంగా ఉన్నప్పటికీ  మధ్యవర్తి వ్యవస్థలో అర్హతగల వారికి తగు అవకాశాలు లభించడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
రాజ్యం బలహీనపక్షాల వైపు ఉండాలి
ప్రభుత్వం(రాజ్యం) ఎప్పుడూ బలహీన వర్గాల పక్షానే ఉండాలని, వారు సంఖ్యాపరంగా గానీ, సామాజిక పరంగా గానీ మైనారిటీ కావచ్చునని, కానీ తద్వా రా పౌరులు ప్రజాస్వామ్య పాలనలో స్వేచ్ఛగా జీవించగలుగుతారని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. జస్టిస్‌ కేశవ చంద్ర మెమోరియల్‌ వ్యాసరచన పోటీకి అతిథిగా విచ్చేసిన ఆయన ప్రజాస్వామ్యంలో మెజారిటీ వర్గీయులకు వారి మార్గముంటుందని, కానీ మైనారిటీ తన అభిప్రాయాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు.
 
బానిసత్వ నిర్మూలన, కుల నిర్మూలన, లింగ మైనారిటీల విముక్తి, మత సామరస్యం ఇలా అన్నీ ఒకప్పుడు భిన్న అభిప్రాయాలని, అయితే ఈ భిన్న అభిప్రాయాలు ఒక ముఖ్యమైన సంభాషణను ప్రారంభించడం ద్వారా మన సమాజాన్ని ప్రాథమికంగా పునర్నిర్మించగలిగే శక్తికి కలిగి ఉన్నాయని సీజేఐ తెలిపారు.