* తెలంగాణాలో కాంగ్రెస్ ముందంజ
మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం వైపు దూసుకు పోతుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన ఆధిక్యతవైపు బిజెపి పరుగులు దీస్తున్నది. మరోవంక, తెలంగాణాలో అధికార బిఆర్ఎస్ వెనుకపడింది. కాంగ్రెస్ మెజారిటీ వైపు ముందుకు వెడుతున్నది.
ఆదివారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో కేవలం మధ్య ప్రదేశ్ లో మాత్రమే అధికారంలో ఉన్న బిజెపి తిరిగి విజయంవైపు వెడుతూ ఉండడంతో పాటు మొత్తం 230 సీట్లు ఉండగా 150కు పైగా సీట్లను గెల్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు పరాజయం చెందుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం వైపు వెడుతోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ శిబిరాల్లో సంబరాలు మొదలయ్యాయి. పార్టీ కార్యకర్తలు, వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలకు వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు ఇప్పుడు మూడు చోట్ల కూడా ఓటమి పరిస్థితులు నెలకొనడం 2024 లోక్ సభ ఎన్నికల ముందు పెద్ద ఎదురుదెబ్బగా పేర్కొనవచ్చు.
ఛత్తీస్‌గఢ్ లో మొదట్లో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్నప్పటికీ క్రమంగా బిజెపి అత్యధిక స్థానాలలో విజయం వైపు దూసుకు వెడుతోంది. మొత్తం 90 సాధనలలో 50కు పైగా స్థానాలను బిజెపి గెలచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ పటాన్ సీటు నుంచి వెనుకంజలో ఉన్నారు.
రాజస్థాన్ లో కూడా 199 స్థానాలలో 115కు పైగా స్థానాలలో బిజెపి ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 79 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ రెండు పార్టీల నుండి సుమారు 40 మంది రెబెల్స్ పోటీలో ఉన్నారు.
ఇప్పటికే బీజేపీ పార్టీ మ్యాజిక్ మార్క్‌ను దాటే సంకేతాలు వెలువడుతున్న మధ్య ప్రదేశ్ లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తన ట్వీట్‌లో స్పందిస్తూ “భారత్ మాతాకీ జై, జనతా జనార్దన్‌కి జై” అంటూ తెలిపారు. ప్రజల ఆశ్వీర్వాదంతో తాము మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం శివరాజ్ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యున్నతం అని చెబుతూ వారి నమ్మకమే నేటి విజయానికి కారణం అని చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ పథకాలే తమ విజయానికి దారితీస్తున్నట్లు చెప్పారు.
కాగా, 119 స్థానాలున్న తెలంగాణాలో మెజారిటీకి అవసరమైన 60కు మించిన స్థానాలలో కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది. 65కు పైగా స్థానాలలో మెజార్టీలో ఉంది. రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గజ్వేల్ లో ఆధిక్యతలో ఉన్నప్పటికీ, కామారెడ్డిలో మూడోస్థానంలో ఉన్నారు. బిజెపి 9 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది.
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాదు జిల్లాలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తున్నది. మెదక్, రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ లో బిఆర్ఎస్ ముందంజలో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ పలు స్థానాలలో ఆధిక్యతలో ఉంది. కేసీఆర్ మంత్రివర్గ సభ్యులు పలువురు వెనుకబడి ఉన్నారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి