మెదక్ జిల్లాలో అరుదైన రాతి చిత్రాల తావు

మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రత్నాపూర్‌లో కొత్తగా అద్భుతమైన రాతి చిత్రాల తావు బయటపడింది. ఆ గ్రామానికి ఆగ్నేయంగా తిరుమలాయ బండ అనే పరుపు బండ, గ్రానైట్ బోడుమీద 40 అడుగుల వెడల్పు, 25 అడుగుల ఎత్తున్న ఏకశిల రాతి గోడమీద ఎరుపురంగులో రాతి చిత్రాలు ఉన్నాయి.
 
తిరుమలాయ గుట్ట మీద విష్ణుకుండినుల నాటి శిథిలమైన వైష్ణాలయం ఉంది. గర్భగుడిలో మూర్తిలేదు. ధ్వజస్తంభం కూలిపోయింది. ఆ బండ అంచున ఉంది. ఉత్తర దిశలో పురాతన నివాసాల జాడలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాల జాడను నాయని నర్సింహా రెడ్డి అనే జర్నలిస్టు చెప్పారు.  బొమ్మలకాన్వాసుకు కింద కుడిచేతివైపు మూలన నగ్నమైన మనిషి తల చుట్టూ కాంతిప్రభలతో గీయబడివున్నాడు. 
 
అతని కుడి చేతి కింద ఒక మూపురం, ఎద్దు, తలపైన మరొక ఎద్దు, ఎరుపురంగు నింపిన బొమ్మలు, మూడవది గీతలతో వున్న ఇంకొక ఎద్దు అతని కాళ్లకింద వుంది. నగ్నత, కాంతిప్రభల ఆధారంగా ఈ బొమ్మలో వుంది భైరవుడని చెప్పవచ్చు. అతనికి ఎడమ చేతివైపున్న బొమ్మలు మాసిపోయివున్నాయి. తలకు ఎడమవైపున తాడుమీద నడుస్తున్న మనిషి వలె కనిపిస్తున్నాడు. 
 
ఈ చిత్రాల్లో రెండు, మూడు దశల బొమ్మలున్నట్టు బొమ్మల వెనక బొమ్మలు డిజైన్లలో కనపడడం మధ్యశిలాయుగానికి చెందినవిగా, పైనున్న దుప్పి, నెమళ్ళు, మనిషి (పురుషాంగంతో), ఎద్దులు (జననావయవ స్పష్టతతో)… ఇవన్నీ కాంస్య యుగానికి చెందినవిగా భావించాలి. మిగతావన్ని మధ్యయుగాలనాటివి.

కొత్తగా రథాలలో కూర్చుని వీరులు చేస్తున్న యుద్ధ దృశ్యాలు, విల్లువాడడం ప్రత్యేకం. భైరవుని బొమ్మకిందుగా మూలన కూడా ఒక విల్లుబొమ్మ కనిపిస్తున్నది. భారతదేశంలోని ‘రాతిచిత్రాలలో రథాలు’ గూర్చి న్యూమేయర్ ఇర్విన్ అనే విదేశీ ప్రాక్చరిత్రకారుడు ‘Chariots in the Chalcolithic Rock Art of India’ అనే పరిశోధనా పత్రం రాసారు. 

భారతదేశంలోని చిత్రిత శిలాశ్రయాలలో వారు 31 రాతి చిత్రాలలో బండ్లు, రథాలను గుర్తించి, వాటి గురించి సవివరమైన చిత్రరచన చేసారు. ఇప్పుడీ రత్నాపూర్ లో కనిపించిన రథాలు తెలంగాణ రాతిచిత్రాల చరిత్రలో అపూర్వం. సంగారెడ్డి జిల్లా ఎడితనూర్ లోని రాతిచిత్రాలలో ఎద్దులబండి ఉంది. ఆ విషయం కూడా ఇర్విన్ గారి పరిశోధనాపత్రంలో ప్రస్తావించబడింది.