సోమవారం తెలంగాణ కేబినెట్ భేటీపై ఆశ్చర్యం..!

డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి డిసెంబర్ 3వ తేదీ అంటే ఆదివారం ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కేబినెట్ మీటింగ్ అనౌన్స్ చేయటం రాజకీయ పరిశీలకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల్లో ఫలితాలు ఖచ్చితంగా తమకే అనుకూలంగా వస్తాయనే విధంగా తమ పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపేందుకే కేసీఆర్ ఈ ప్రకటన చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వాస్తవానికి డిసెంబర్ 3వ తేదీన జరిగే కౌంటింగ్‌లో బీఆర్ఎస్‌కు మెజార్టీ రాకపోతే కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉండదు. ప్రజావిశ్వాసం కోల్పోయినందున పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వెంటనే రాజీనామా చేయకపోయినా.. ఆ ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించటం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చినా ఆ మరుసటి రోజే పాత మంత్రులతో కేబినెట్ మీటింగ్ పెట్టటం కూడా ఎబ్బెట్టుగా ఉంటుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4వ తేదీన కేబినెట్ మీటింగ్ ఉంటుందంటూ కేసీఆర్ చేసిన ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆదివారం నాటి ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్ణయించటంతో.. అందరి దృష్టీ ఇప్పుడు కౌంటింగ్‌పై కేంద్రీకృతం అవుతోంది.