తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వమా?  హాంగ్ అసెంబ్లీ!

* సీఎంని నిర్ణయించెడిది గ్రేటర్ హైదరాబాద్
తెలంగాణాలో  కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు లభించవచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడి చేస్తుండడంతో తాము అధికారంలోకి వచ్చేశామని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకొంటున్నారు. అయితే, ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించే విషయంలో మాత్రం అస్పష్టత నెలకొంది.  మరోవంక, గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు.
ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తామని బీఆర్ఎస్, తమదే అధికారమని కాంగ్రెస్.. లేదు తాము పోటీలోనే ఉన్నామని బీజేపీ అంటోంది. కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా హంగ్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.  అదే జరిగితే కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బిజెపి, ఎంఐఎం కీలకంగా మారే అవకాశం ఉంది.
అయితే  గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలను నిర్ధారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గ్రేటర్‌లో గెలిచిన వారికే అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది. గ్రేటర్ దాని చుట్టుపక్కల పరిధిలో మొత్తం 29 స్థానాలు ఉండగా,  మెజార్టీ స్థానాలు సాధించిన వారికే ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటి అధికారంలోకి వచ్చింది.  గ్రేటర్ లో పోటీ ప్రధానంగా బిఆర్ఎస్ – బిజెపి మధ్య ఉన్నట్లు భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో సహితం కాంగ్రెస్ వెనుక పడినట్లు చెబుతున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లలో అంతగా మద్దతు లేని కాంగ్రెస్ ఈ పర్యాయం ఎక్కువగా టీడీపీ అభిమానుల ఓట్లపై ఆశలు పెట్టుకుంటున్నది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ చతికలపడితే ప్రభుత్వం ఏర్పాటులో బిజెపి `కింగ్ మేకర్’గా మారే అవకాశం ఉంటుంది. పైగా, పోలింగ్ తక్కువగా నమోదైంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే కావడం గమనార్హం. 
 
గ్రేటర్ లో పట్టు సాధించలేకపోతే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మిగతా 88-91 స్థానాల్లోనే 60 సీట్లు గెలవాల్సి ఉంటుంది. అంటే 70 శాతం సీట్లను హస్తం పార్టీ గెలుచుకోవాల్సి ఉంటుంది. ఇది దాదాపు సాధ్యం కాకపోవచ్చు. పైగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో 73 శాతానికిపైగా పోలింగ్ నమోదు కాగా, ఈసారి అది 71 శాతానికే పరిమితం అయింది. 
 
కాంగ్రెస్‌కు 8-20 శాతం మొగ్గు రాని పక్షంలో ఆ పార్టీ మెజార్టీ మార్క్‌ను చేరుకోవడం సాధ్యం కాదని, అదీగాక ఓటింగ్ శాతం పెరగనప్పుడు ఒకే పార్టీకి స్వింగ్ రావడం కష్టమవుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సహితం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ఎప్పుడు 50 నుండి 55 సీట్లకు మించి అత్యధికంగా గెల్చుకున్న దాఖలాలు లేవు.

జన్ కీ బాత్ సర్వే చూస్తే  బీఆర్ఎస్ పార్టీకి 40-55 సీట్లు వస్తాయని తెలపగా, కాంగ్రెస్ పార్టీకి 48-64 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. బీజేపీ 7-13, ఎంఐఎం – 4-7 సీట్లలో గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

రిపబ్లిక్ – మాట్రిజ్ సర్వేలో కాంగ్రెస్ కు 58-68, బీఆర్ఎస్ కు 46-56 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీకి 4-9 సీట్లు రావొచ్చని పేర్కొంది. వీరి సర్వే ప్రకారం చూస్తే తెలంగాణలో హంగ్ రావొచ్చని చెప్పొచ్చు. జన్ కీ బాత్ సర్వే కూడా ఇదే విషయాన్ని బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది.

 సిఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్-56 సీట్లు, బీఆర్ఎస్-48, బీజేపీ-10,ఎంఐఎం-5 సీట్లు గెలుస్తుందని తెలిపింది. వీరి లెక్క ప్రకారం కూడా హంగ్ కే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. టివి9 భారత్ వర్ష – పోల్ స్టార్ట్ వారి ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్ కు 48-58 సీట్లు, కాంగ్రెస్ కు 49-59 సీట్లు వస్తాయని అంచనా వేసింది. వీరి సర్వేలో కూడా స్పష్టమైన మెజార్టీ మార్క్ దాటినట్లు కనిపించటం లేదు.

అయితే, కాంగ్రెస్‌కు తెలంగాణ ఓటర్లు పట్టం కట్టబోతున్నట్లు పీపుల్స్‌పల్స్‌- సౌత్‌ఫస్ట్‌ ఎగ్టిట్ పోల్స్ వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీ 62-72 సీట్లు కైవసం చేసుకుంటుందని… బీఆర్‌ఎస్‌ 35-46, బిజెపి 3-8, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఏకపక్షంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది.