తెలంగాణ ఎన్నికల్లో 70.79 శాతం పోలింగ్

తెలంగాణలో  రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 10 వరకు ఓటర్లు క్యూలైన్లలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 70.79 శాతం పోలింగ్ నమోదైంది. భువనగిరిలో అత్యధికంగా 90.03శాతం పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్ లో అత్యల్పంగా 46.68శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్  తెలిపారు.
 
నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడు నియోజవర్గంలో అత్యధికంగా 91.51 శాతం నమోదైంది. అత్యల్పంగా యాకుత్‌పురాలో 39.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  అసెంబ్లీ ఎన్నిల్లో పల్లె జనం పోటెత్తగా, పట్టణ ప్రజలు బద్దకించారు. రాష్ట్రవ్యాప్తంగా 2018లో 73.37 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 3 శాతం తక్కువగా నమోదైంది. 
“డిసెంబర్‌ 3న జరిగే ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్‌ ఫ్రం హోమ్‌ మంచి ఫలితాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో రీపోలింగ్‌కు అవకాశం లేదు’’ అని వికాస్‌రాజ్‌ వెల్లడించారు.
 
ఓటు వేయటానికి ప్రభుత్వం సెలవు ఇచ్చినా, పోలింగ్ కేంద్రంలో సమయం వృథా కాకుండా పోల్ క్యూ రూట్ అనే సదుపాయం కల్పించినా  పట్టణ ప్రజలు ఓటేయటానికి ముందుకు రాలేదు. పోలింగ్ రోజు సెలవు ఇవ్వటం, మధ్యలో శుక్రవారం కూడా సెలవు పెట్టుకుంటే లాంగ్ వీకెండ్ అనే ఉద్దేశ్యంతో చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
గత ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకోవడానికి ముందుకు రాగా ఈసారి కూడా వారు అదే ఒరవడిని కొనసాగించారు.   పట్టణాల నుంచి పల్లెలకు చేరుకున్న గ్రామీణ ఓటర్ల రాకతో ఉన్నట్టుండి పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి. ఓవైపు రాష్ట్రం నుంచి వలస వెళ్లిన ఓటర్లు రాక మరోవైపు కెరటంలా వెలిసిన యువ ఓటర్లతో ఓటింగ్ శాతం ఊపందుకుంది.
ముఖ్యంగా మెట్రో యువత ఓటువేయడాన్ని తమకు సంబంధం లేని అంశంగా చూస్తున్నారని తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైంది.  గ్రేటర్‌లో సుమారు 24 నియోజక వర్గాల పరిధిలో 77 లక్షల మందికి పైగా ఓటర్లుగా నమోదు కాగా, వీరిలో తమ ఓటుహక్కు వినియోగించుకునే వారు మాత్రం చాలా తక్కువ అని పోలింగ్ అనంతరం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం: యాదాద్రి – 90.03, మెదక్ – 86.69, జనగాం – 85.74, నల్గొండ – 85.49, సూర్యాపేట – 84.83, మహబూబాబాద్ – 83.70, ఖమ్మం – 83.28, ములుగు – 82.09, భూపాలపల్లి – 81.20, గద్వాల్ – 81.16, ఆసిఫాబాద్ – 80.82, 
 
సిద్దిపేట – 79.84, కామరెడ్డి – 79.59, నగర్ కర్నూల్ – 79.46, భద్రాద్రి – 78.65, నిర్మల్ – 78.24, వరంగల్ – 78.06, మహబూబ్‌నగర్ – 77.72, వనపర్తి – 77.64, నారాయణపేట – 76.74, పెద్దపల్లి – 76.57, వికారాబాద్ – 76.47,
 
 సంగారెడ్డి – 76.35, సిరిసిల్ల – 76.12, జగిత్యాల – 76.10, మంచిర్యాల – 75.59, కరీంనగర్ – 74.61, నిజామాబాద్ – 73.72, హనుమకొండ – 66.38, మేడ్చల్ – 56, రంగారెడ్డి – 59.94, హైదరాబాద్ 46.56.