కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో కట్టుదిట్టం చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నట్లు పేర్కొన్న ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. 

రాష్ట్రంలో ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడలేదని చెప్పారు. రాష్ట్రంలో 79 నియోజకవర్గాల్లో 75 శాతం కంటే ఎక్కువ పోలింగ్‌ నమోదైందని తెలిపారు. పోలింగ్‌ సరళిని పర్యవేక్షించడానికి వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఎంపిక చేసినట్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర మూడెంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతుందని తెలిపారు.  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించారు.

 మొదటి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించున్నట్లు తెలిపారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ సారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు.  రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మద్యం దుకాణాలు బంద్ చేశారు. 8.30గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లు లెక్కింపు షురూ అవుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కానట్లయితే రెండు ఓట్ల లెక్కింపు ప్రక్రియలను సమాంతరంగా నిర్వహిస్తామని తెలిపారు.

పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని, పరిశీలకుల ఆమోదం తర్వాతే ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ అధికారి వివరించారు.  ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కౌంటింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని, వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.