ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై నాగార్జునసాగర్‌ విజయపురి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సిసి కెమెరాలు ధ్వంసం చేసి, తమ భూభాగంలో బలవంతంగా ప్రవేశించారని తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
 
సెక్షన్ 447, 427 కిందతెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఎ-1గా ఏపీ పోలీస్‌ ఫోర్స్‌ను పేర్కొన్నారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఫిర్యాదు చేసింది. 500 మంది సాయుధ బలగాలతో  సాగర్‌ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారంటూ ఫిర్యాదు చేశారు. ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకూ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. 
 
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌పై ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. అటు ఆంధ్రా పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులూ ఇరువైపులా పెద్దఎత్తున మోహరించారు.  రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వందలాదిమంది పోలీసులను రంగంలోకి దింపాయి.  13 గేట్లను తమ ఆధీనంలోకి తీసుకున్న ఏపీ పోలీసులు  సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.
మరోవైపు, తెలంగాణ పోలీసులు కూడా  రంగంలోకి దిగి13వ గేటు దగ్గర బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలను తొలగించే ప్రయత్నం చేశారు.  అయితే, ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో నాగార్జునసాగర్‌పై యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. 13వ గేట్‌ నుంచి 26వ గేట్‌ వరకు స్వాధీనం చేసుకుంది ఏపీ. వేలాది మంది ఆర్మ్‌డ్‌ పోలీసులను రంగంలోకి దింపి 13వ గేటు దగ్గర బారికేడ్లు, ఇనుక ముళ్ల కంచెను వేసింది. దాంతో తెలంగాణ ఏపీ చర్యలపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
 
మరోవైపు సాగర్ వ్యవహారంపై కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డు అధికారులు చర్చలు జరుపుతున్నారు. శుక్రవారం సాగర్ చేరుకున్న బోర్డు అధికారులు బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుపైకి ఏపీ పోలీసులు బలవంతంగా ప్రవేశించినట్లు కెఆర్‌ఎంబి అధికారులకు తెలంగాణ ఎస్పీఎఫ్‌ సిబ్బంది వివరించారు.
 
ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 522 అడుగులకు చేరింది. గురువారం నుంచి సుమారు 4 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేస్తుంది. మరో 12 అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్‌ స్టోరేజీకి చేరుతుందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
 
ఇలా ఉండగా, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో 13వ నంబరు గేటు వరకు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని, వాటినే తాము స్వాధీనం చేసుేకున్నామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఏపీ హక్కుల్ని కాపాడుకోడానికే అలా చేయాల్సి వచ్చిందని చెబుతూ సమయాన్ని బట్టి వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుందని తేల్చి చెప్పారు.