వాయుగుండంతో ఏపీలో అతిభారీ వర్షాలు!

ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దానితో రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు  ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

సోమవారం సాయంత్రం చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవనున్నారు. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఏర్పడే తుపాన్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలలో తీరం దాటుతాయని భావిస్తున్నారు. వాతావరణ మార్పు కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు తుఫాన్లు ఉత్తరదిశగా వెళ్లిపోయాయి. తమిళనాడు నుంచి ఏపీ వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణం అంటున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ సూచనలు చేశారు.

ఈ ఏడాది రెండు తుఫాన్ దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంత స్థాయిలో వానలు లేవు. పసిఫిక్‌ సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలుల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదవుతోంది. గతంలో తూర్పుగాలుల ప్రభావం రాష్ట్రం వరకూ ఉండి.. మంచి వర్షాలు పడేవి. ప్రస్తుతం ఆ గాలులు తమిళనాడు వరకే పరిమితమయ్యాయి. ఇటీవల కాలంలో తుఫాన్‌ల గమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది.

ఇక తెలంగాణలో చూస్తే, డిసెంబరు 3వ తేదీ వరకు పొడి వాతవరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్ ప్రభావంతో డిసెంబర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే పలు ప్రాంతాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంటూ  ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.