దాదాపు ప్రతిరోజూ తీవ్రమైన వాతావరణ విపత్తులో భారత్

* కాప్ -28 సదస్సు ముందు ఆందోళన కలిగిస్తున్న సిఎస్ఈ నివేదిక
 
భారతదేశం ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు ప్రతిరోజూ ఒక తీవ్రమైన వాతావరణ విపత్తును చూసింది.  వేడి- చలి తరంగాలు, తుఫానులు- మెరుపుల నుండి భారీ వర్షం, వరదలు- కొండచరియలు విరిగిపడటం వరకు. జనవరి 1 నుండి  సెప్టెంబర్ 30, 2023 మధ్య, ఇటువంటి సంఘటనలు 86 శాతం రోజులలో దృఢమైన, భయపెట్టే క్రమబద్ధత, ప్రభావంతో దేశాన్ని తాకాయి.
 
ఈ విపత్తులు 2,923 మంది మానవ ప్రాణాలను బలిగొన్నాయి. 1.84 మిలియన్ హెక్టార్ల పంట విస్తీర్ణంపై ప్రభావం చూపాయి. 80,000 ఇళ్లు ధ్వంసంతో పాటు 92,000 కంటే ఎక్కువ పశువుల మరణానికి దారితీసింది. మరింత భయంకరమైన విషయం ఏమిటంటే ఈ గణాంకాలు అసంపూర్ణంగానే ఉన్నాయి. వాస్తవానికి పరిస్థితులు మరింత ఆందోళనకరంగానే ఉన్నాయి.
 
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో గురువారం నుండి దుబాయిలో పర్యావరణ పరిరక్షణకోసం ఉద్దేశించిన వాతావరణ సదస్సు కాప్ -28 ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధిచెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్ఈ), డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 
 
 “ఇండియా 2023: విపరీత వాతావరణ సంఘటనల అంచనా” దేశంలోని విపరీత వాతావరణ సంఘటనల ఫ్రీక్వెన్సీ, విస్తరిస్తున్న భౌగోళిక శాస్త్రంపై సాక్ష్యాధారాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ అంచనా స్పష్టంగా చూపుతున్నట్లుగా, 2023లో దేశం ఇప్పటివరకు చూసినది వేడెక్కుతున్న ప్రపంచంలో కొత్త ‘అసాధారణ’ అని అంచనా నివేదికను విడుదల చేస్తూ సిఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ తెలిపారు.
 
కొన్నేళ్ల క్రితం వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాలకే వీటి ప్రభావం పరిమితం కాగా, ఇప్పుడు  ఏదో రూపంలో వాతావరణ మార్పుల ప్రభావం దేశమంతా పడుతోంది. నష్టతీవ్రత కూడా గణనీయంగా పెరుగు తోంది. గత ఏడాది (2022లో) 15 రాష్ట్రాల్లోనే తీవ్రమైన వాతావరణ ఘటనలు నమోదుకాగా, ఈ ఏడాది 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ తరహా సంఘటనలు విస్తరించాయి. ఫలితంగా ప్రాణనష్టం పెరిగింది. తెలుగు రాష్ట్రాల పైనా వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగానే ఉంది. 2022లో ఈ తరహా ఘటనల కారణంగా దేశవ్యాప్తంగా 2,755 మంది మరణించగా ఈ ఏడాది మృతుల సంఖ్య 2,923కుచేరింది.

అధికారిక సమాచారం గత ఏడాది మాదిరేఈ సంవత్సరం కూడా 1.84 మిలియన్‌ హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే, పంట నష్ట తీవ్రత కూడా గత ఏడాదితో పోలిస్తే అధికంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

జనవరి – ఫిబ్రవరి నెలల్లోఈ ఏడాది జనవరి-పిబ్రవరి నెలల్లో 28 రోజులు తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో 21 రోజులు తీవ్రమైన చలిగాలులు దేశాన్ని వణికించాయి. పిడుగుపాటు ఘటనలు, భారీ వర్షాల వంటి సంఘటనలు కూడా ఉత్తర భారతంలో చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. 

జనవరి నెలలో ఎనిమిది సంవత్సరాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రోజు దక్షిణ భారతంలో నమోదైంది. ఆ రోజున సగటున 30.59 సెల్సియస్‌ ఉష్ణోగ్రత దక్షిణ భారతంలో నమోదైంది. ఈ నెలల్లో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆ రాష్ట్రాల్లో 15 రోజుల్లో తీవ్ర వాతావరణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. 

మార్చి నుండి మే వరకు, మార్చి – మే నెలల మధ్య కూడా అనేక రాష్ట్రాలో వర్షాలు, వరదలు, పిడుగుపాట్ల వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 16 రోజులు భారీ వర్షాలు, వరదలు సంభవించగా, 79 రోజుల్లో పిడుగులు పడ్డాయి. 28 రోజులు దేశ వ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీచాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా 321 మంది మరణించారు. 

మార్చి నుండి మే నెల వరకు గత ఏడాది 10 వేల హెక్టార్లలో పంట నష్టం చోటుచేసుకోగా, ఈ ఏడాది 6 లక్షల 40 వేల హెక్టార్లలో నష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదల ప్రభావం మహారాష్ట్ర, రాజస్తాన్‌లపై తీవ్రంగా పడింది. జూన్‌ నుండి సెప్టంబర్‌ వరకు వరకు దేశ వ్యాప్తంగా 122 తీవ్ర వాతావరణ సంఘటనలు నమోదైనాయి. 

వీటిలో 115 రోజుల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి బారిన పడి దేశవ్యాప్తంగా 2,594 మంది మరణించారు. 2022లో ఈ కాలంలో తీవ్ర వాతావరణ సంఘటనల కారణంగా 2,431 మంది మరణించారు. రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, సీజన్‌ ప్రారంభంలోనే వచ్చిన బిపర్‌ జారు తుపాన్‌ పశ్చిమ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. జులై నెలల్లో హిమాచల్‌ ప్రదేశలో అకస్మిక వరదలు చోటుచేసుకున్నాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుండి సెప్టెంబర్‌ 30వ తేది వరకు 273 రోజుల్లో 45 తీవ్ర వాతావరణ ఘటనలు చోటుచేసుకోగా, తెలంగాణలో వీటి సంఖ్య 52గా నమోదైంది. వీటికారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 45 మంది మరణించగా, తెలంగాణలో 33 మంది మృతి చెందారు. తెలంగాణలో 62,811 హెక్టార్లలో పంట నష్టం సంభవించగా, ఆంధ్రప్రదేశ్‌లో 9015 హెక్టార్ల నష్టం వాటిల్లింది.