పౌరసత్వ చట్టం అమలు కాకుండా ఏ శక్తీ ఆపలేదు

పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) అమలు కాకుండా ఏ శక్తీ ఆపలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. సీఏఏ ఈ దేశ చట్టమని పేర్కొంటూ ఈ చట్టాన్ని పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా అమలు పరుస్తామని తేల్చి చెప్పారు.  పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో బుధవారంనాడు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మమతా బెనర్జీ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తుతూ 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు.  కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నూతన పౌరసత్వచట్టాన్ని అమలు చేసి తీరుతుందని తెలిపారు. ఆరు నూరైనా దీనిని అమలు చేయడం జరుగుతుందని భరోసా ఇచ్చారు.  ”సీఏఏ ఈ దేశ చట్టం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అమలుచేస్తుంది. ఎవరూ దీన్ని ఆపలేరు” అని పరోక్షంగా మమతా బెనర్జీ వ్యతిరేకతను ప్రస్తావిస్తూ అమిత్‌షా పేర్కొన్నారు. 
 
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్‌ నుంచి 2014 డిసెంబర్ 31, అంతకంటే ముందు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్ మైగ్రెంట్లకు పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ- 2019 ఉద్దేశించింది. డిసెంబర్ 12న ఈ చట్టాన్ని నోటిఫై చేయగా, 2020 జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది.
మమతా రాజకీయ కక్షలకు దిగారని మండిపడుతూ బయటి నుంచి తరలివస్తున్న పౌరులకు మమత బెనర్జీ సహాయ పడుతున్నారని, కొత్త చట్టం అమలు అయితే ఇక తన దుష్ట పన్నాగాలు సాగవని ఆమె భయపడుతున్నారని, అందుకే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.
పశ్చిమబెంగాల్‌ భవిష్యత్తుపై బీజేపీకి స్పష్టమైన విజన్ ఉందని కోల్‌కతా ర్యాలీలో అమిత్‌షా తెలిపారు. పశ్చిమబెంగాల్ ప్రజలు 18 లోక్‌సభ స్థానాలు, 77 స్థానాలు బీజేపికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ అసెంబ్లీ నుంచి బీజేపీ నేత సువేందు అధికారిని సస్పెండ్ చేసి ఉండవచ్చని, కానీ ప్రజల వాణిని అణగదొక్కలేరని ఆయన హెచ్చరించారు. 

బుజ్జగింపు, చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింసతో మమతా బెనర్జీ బెంగాల్ ను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెంగాల్ ప్రభుత్వాన్ని సాగనంపుతామని ప్రజలంతా చెబుతున్నారని ఆయన తెలిపారు. భారీఎత్తున చొరబాట్లను అనుమతించే రాష్ట్రం అభివృద్ధి సాధింపలేదని స్పష్టం చేస్తూ, అస్సాంలోని బిజెపి ప్రభుత్వం చొరబాట్లను కట్టడి చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో పయనింపచేస్తున్నదని ఆయన తెలిపారు.

ఒకప్పుడు చొరబాట్ల అంశంపై పార్లమెంట్ లో కార్యక్రమాలను స్తంభింప చేసిన మమతా బెనర్జీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ అంశంపై మౌనంగా ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. బెంగాల్ అభివృద్ధికి గతంలోని యుపిఎ హయాంలో కన్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నదని ఆయన చెప్పారు. అయితే,  రాష్ట్ర సంక్షేమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంపుతున్న నిధులు అధికార టీఎంసీ జోక్యం వల్లే ప్రజలకు చేరడం లేదని అమిత్ షా ఆరోపించారు.

బీజేపీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో పశ్చిమబెంగాల్‌లో అధికారంలోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని, తద్వారా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయానికి బాసటగా నిలబడాలని కోరారు. 2020 అసెంబ్లీ ఎన్నికలలో రిగ్గింగ్ ద్వారా మమతా బెనర్జీ తిరిగి గెలుపొంది గలిగినా బీజేపీ తన బలాన్ని `సున్నా’ నుండి 77 సీట్లకు పెంచుకోగలిగిందని హోమ్ మంత్రి గుర్తు చేశారు. 

పశ్చిమబెంగాల్‌లో 212 మంది బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని చెబుతూ 2026 ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం ద్వారా ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలకు పూర్తి స్థాయిలో వారి అధినేత్రి మమత బెనర్జీ అహంకార ధోరణి అలవడిందని ధ్వజమెత్తుతూ వీరు చివరికి ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్‌ను, కట్టుబాట్లను పాటించడం లేదని కేంద్ర హోం మంత్రి విమర్శించారు.

ఈ పార్టీ ఎంపి మహువా మొయిత్రా చివరికి తన లోక్‌సభ సభ్యత్వ సైట్ లాగిన్‌ను డబ్బుల కోసం తాకట్టు పెట్టారని గుర్తు చేశారు.  దీనిని బట్టి టిఎంసి ఎంపిలకు సభల పట్ల ఎంతటి గౌరవం ఉందనేది తెలుస్తోందని ఎద్దేవా చేశారు. సభలలో ప్రశ్నలు వేసేందుకు కూడా ఎంపిలు డబ్బులు తీసుకుంటున్నారంటే ఇక వీరి అవినీతి స్థాయి ఎంతవరకూ వెళ్లిందనేది ప్రజలు గుర్తించాల్సి ఉందని ధ్వజమెత్తారు.