ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

ఏపీలో మరోసారి ఐఏఎస్ అధికారులకు కోర్టు ధిక్కార కేసులో జైలు శిక్ష పడింది. ఇప్పటికే హైకోర్టు పలు కోర్టు ధిక్కార కేసుల్లో ఐఏఎస్ లకు జైలు శిక్షలు విధించడం, ఆ తర్వాత వారు క్షమాపణ చెప్పడంతో దాన్ని రద్దు చేయడం జరిగింది. తాజాగా మరోసారి ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధిక్కార కేసులో నెల రోజుల జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు మరోసారి సంచలన ఆదేశాలు ఇచ్చింది. 
 
దీంతో ఐఏఎస్ ల జైలుశిక్ష వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ లు శ్యామలరావు, పోలా భాస్కర్ లకు న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయలు జరిమనా కూడా విధించడం గమనార్హం. ఇక శిక్ష పడిన వీరిద్దరూ డిసెంబర్ 8 లోగా రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ ఆదేశాలపై సదరు ఐఏఎస్ అధికారులు హైకోర్టును సమీక్ష కోరే అవకాశం ఉంది. 2019కు ముందు ఏపీలో జరిగిన నీరు-చెట్టు పనుల బిల్లుల చెల్లింపుకు హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయినా ఆ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. 
 
దీంతో తమ ఆదేశాలు పాటించని అధికారులపై కోర్టు ధిక్కార చర్యలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నీరు-చెట్టు బిల్లుల చెల్లింపు చేయని అధికారులపై చర్యలకు ఆదేశించింది. గతంలోనూ హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాల్ని అమలు చేయని ఐఏఎస్ లకు జైలుశిక్షలు పడ్డాయి. అయితే వాటిని ఆ తర్వాత హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.