మార్చ్ 6న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు!

తెలంగాణాలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుండగా, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో సహితం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. ఎప్పుడు ఎన్నికల ప్రకటన జరిగినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2 నుండి ఎన్నికల కోడ్ అమలులోకి రాగలదని భావిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరుగనున్న దృష్ట్యా ఆ రోజునే కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రకటన చేయవచ్చని అంచనా వేస్తున్నారు.  ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు మార్చి 6న ఎన్నికలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది.  ఈ నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు.
ఏపీలో విమర్శలు ప్రతి విమర్శలు మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల జాబితాను తయారు చేసింది.  ఎన్నికల సన్నాహాలలో భాగంగా ఎన్నికల కమిషన్ తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఓ వైపు ఈవీఎం ల మీద అవగాహన కల్పిస్తూ, మరో వైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై దృష్టి సారించింది.  ఇక తాజాగా ఏపీలో వున్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం విడుదల చేసింది.
 
ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో పురుషుల ఓటర్లు 1,83,24,588 మంది వుండగా, మహిళలు 1,86,04,742 మంది వున్నారని తెలుస్తుంది, ఇక థర్డ్ జెండర్ ఓటర్స్ 3,761 మంది ఉన్నారని  ఎన్నికల సంఘం లెక్కల్లో పేర్కొంది.
 
కాగా,  రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు వుండగా, అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో వున్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది. అలాగే ఓట్ల తొలగింపు అనేది కేవలం పుకారు మాత్రమె అని, అందులో వాస్తవం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.