తెలంగాణలో మాఫీయా రాజ్యం  .. యోగి హెచ్చరిక

తెలంగాణలో మాఫీయా రాజ్యమేలుతోందని పేర్కొంటూ ఈ మాఫీయాను హెచ్చరించడానికి ఇక్కడికి వచ్చినట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహబూబ్ నగర్ లో ఆదివారం ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ఏర్పడితే మాఫియాలా ఆటలు కాట్టే అని స్పష్టం చేసారు.  2017 కంటే ముందు ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి మాఫీయా ఉండేదని, ప్రతి రెండు, మూడు రోజులకోసారి గొడవలు జరిగేవని గుర్తు చేశారు.

తెలంగాణలో బిఆర్ఎస్  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేశాడని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయి కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని, తెలంగాణ మాత్రం అభివృద్ధి చెందలేదని ధ్వజమెత్తారు.

అయితే, మోదీ నేతృత్వంలో, మార్గదర్శకంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ హయాంలో ఎలాంటి కర్ఫ్యూ లేదని చెప్పారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని పేర్కొంటూ ఈ మూడు పార్టీలకు ఓట్లు వేస్తే వీరు బలోపేతం అవుతారని హెచ్చరించారు. మోదీ నేతత్వంలో దేశం గౌరవ ప్రతిష్టలు పెరిగాయని, మోదీ హయాంలో దేశంలో మౌళిక వసతుల నిర్మాణం జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో దేశంలో అవినీతి, కుంభకోణాలు వెలుగు చూశాయని, ప్రధాని మోడీ అధికారంలోకి రాగానే అన్ని రూపుమాపామమని గుర్తు చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చారని, కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ఆదిత్యనాథ్ విమర్శించారు. మోదీ హయాంలో  వందేభారత్ రైలు, హైవే, ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ లో 6 ఏళ్లలో 55 లక్షల మంది ప్రధానమంత్రి అవాజ్ ఇళ్లు నిర్మాణం చేసినట్లు తెలిపారు. తెలంగాణాలో పేపర్ లీకేజీ జరుగుతున్నదని, ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

దేశంలో సబ్కా సాత్ సబ్ కా. వికాస్ నినాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. జనవరి 22న అయోధ్య రామ్ మందిర్ లో మోదీ చేతులమీదుగా ప్రతిష్టాపన జరుగుతున్నట్లు యోగి వెల్లడించారు.ప్రజలంతా కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌​కు మద్దతుగా యోగి ఆదిత్యనాథ్ రోడ్‌​షోలో పాల్గొన్నారు. భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దీంతో కుత్బుల్లాపూర్ రహదారులన్నీ కాషాయమయం అయ్యాయి. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తెలంగాణలో ల్యాండ్ మాఫియా నడుస్తోందని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి కుటుంబపాలన రాజ్యమేలుతుందని, వీరితో ఇంకా ఎన్ని రోజులు బాధ పడతారని యోగి ప్రశ్నించారు. అయోధ్యలో రామ మందిరాన్ని ఎలా నిర్మిస్తున్నామో రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అవకాశమిస్తే ప్రజల ఆశయాలను అలాగే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు యోగి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదుల ఆట కట్టించామని చెప్పారు. భారత దేశం వైపు చూడాలంటేనే ఉగ్ర మూలాలకు వెన్నులో వణుకుపుడుతుందని స్పష్టం చేశారు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు యోగి ఆదిత్యనాథ్.