ములుగు జిల్లాలోకి మావోయిస్టు యాక్షన్ టీం

 
* తెలంగాణ ఎన్నికల భగ్నంకై ఛత్తీస్ గఢ్ నుంచి
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు ఛత్తీస్ గఢ్ దండకారణ్యం నుంచి మావోయిస్టు యాక్షన్ టీం ములుగు జిల్లాలోకి వచ్చిందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మావోయిస్టు యాక్షన్ టీం వివరాలను ఫొటోలతో సహా విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీపీఐ మావోయిస్టు పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని ప్రకటన చేసిందని పేర్కొంటూ కానీ అలాంటి వాటిని ప్రజలు పట్టించుకోవద్దని కోరారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు పోలీస్ శాఖ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన భరోసా ఇచ్చారు.

మావోయిస్టు పార్టీ తమ వ్యూహాలను అమలు చేయడానికి ఆరుగురు సభ్యుల యాక్షన్ టీమ్ ను ములుగు జిల్లాకు పంపిందని ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఇందులో ఛత్తీస్ గఢ్ కు చెందిన కుంజం ఇడుమల్ అలియాస్ మహేందర్, కొవ్వాసి గంగ అలియాస్ మహేష్, ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్, వెట్టి దేవ అలియాస్ బాలు, పొట్టం అడుమ అలియాస్ సంజు అలియాస్ సంజీవ్, వెట్టి లక్మ అలియాస్ కల్లు సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. 

ఈ ప్రత్యేక యాక్షన్ టీమ్ ఇటీవల తెలంగాణ సరిహద్దులను దాటి ములుగు ఏరియాలోకి ప్రవేశించిందని వివరించారు. ఈ బృందం జిల్లాలోని ఎన్నికల విధుల్లో నిమగ్నమైన భద్రతా సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను హతమార్చడంతో పాటు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కుట్ర పన్నిందని ఎస్పీ తెలిపారు. 

రానున్న ఎన్నికలను భగ్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు.  సెప్టెంబర్ 26, 2023న పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించి నేరం చేయడానికి ప్రయత్నించే క్రమంలో అక్కడి సిబ్బంది అడ్డుకున్నారని, దీంతో ఛత్తీస్ గఢ్ కు పారిపోయారని ఆయన వివరించారు. మావోయిస్టులు తలపెట్టే చర్యలను ఎదుర్కోవడంలో భాగంగా పోలీసులు డ్రోన్ తో నిఘా, కార్డన్ సెర్చ్ ఆపరేషన్, టాక్టికల్ వెహికల్ చెకింగ్, ఏరియా డామినేషన్ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టుల నుంచి ప్రజలకు, రాజకీయ ప్రజాప్రతినిధులకు, భద్రతా సిబ్బందికి ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. 

ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకు పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి రేయింబవళ్లు తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశా రు. ఎట్టిపరిస్థితుల్లోనూ మావోయిస్టులకు ఆశ్రయం కల్పించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.