ఫామ్‌హౌజ్‌లో పడుకునే సీఎం కెసిఅర్ అవసరమా?

సచివాలయానికి వెళ్లని సీఎం మనకు అవసరమా?  ఫామ్‌హౌజ్‌లో పడుకునే ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఓటర్లను ప్రశ్నించారు. ఆదివారం మెదక్ జిల్లా తుఫ్రాన్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ బిజెపి నేత ఈటల రాజేందర్ కు బయపడే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని చెప్పారు. 

తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. 26/11 దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతూ చేతకాని అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుందని మోదీ హెచ్చరించారు. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

ప్రజలను కలవని సీఎం మనకు అవసమా? అంటూ తెలుగులో మాట్లాడిన మోదీ దుబ్బాక, హుజూరాబాద్‌లో ట్రైలర్ చూశారని, ఇకపై ఇప్పుడు అసలు సినిమా చూస్తారని స్పష్టం చేశారు.  బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొంటూ బీజేపీ తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని భరోసా వ్యక్తం చేశారు.
 
తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ నిర్ణయించిందని పేర్కొంటూ సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు.  రాష్ట్రంలో ఎస్సీలకు అన్యాయం జరిగిందని.. ఎస్పీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలిపారు.  ఎస్పీ వర్గీకరణ చేసి తీరుతామని, త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు
 
. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అవినీతి, కుటుంబ పాలన సొంతమని ప్రధాని మోదీ విమర్శించారు. తెలంగాణ నిధులన్నీ కేసీఆర్ తన కుటుంబానికి మళ్లించారని, నీళ్లు, నిధులు పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దోచుకున్న కేసీఆర్ ఇప్పుడు దేశంపై పడ్డారని ధ్వజమెత్తారు.  దేశంలో లూటీ చేసేందుకు ఢిల్లీలో ఒక నేతతో చేతులు కలిపారని ప్రధాని ఆరోపించారు. 
 
ఢిల్లీ నేతలతో కలిసి లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారని, కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతిపై దర్యప్తు కొనసాగుతోందని మోదీ తేల్చి చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు పెద్దగా తేడా లేదని ప్రధాని మోదీ పేర్కొంటూ కాంగ్రెస్‌ సుల్తానులను పెంచి పోషిస్తే బీఆర్ఎస్ నిజాంలను పోషించిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో బోఫోర్స్‌ లాంటి ఎన్నో కుంభకోణాలు జరిగాయని గుర్తు చేశారు. 
 
సీఎం కేసీఆర్‌ పాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతి దాంట్లో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ప్రధాని తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌, రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. పేపర్ల లీక్ తో నియామకాలు ఆగిపోయాయని చెబుతూ సీఎం కేసీఆర్‌ రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని ప్రధాని మోదీ సూచించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల వల్ల వ్యవస్థలు నాశనం అయ్యాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ రెండు కుటుంబ పార్టీలు తమ వారసుల గురించి మాత్రమే ఆలోచిస్తాయని ఆరోపించారు. బీసీల్లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా వాళ్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అందుకే తెలంగాణలో బీసీని సీఎంను చేస్తామని బీజేపీ ప్రకటించిందని తెలిపారు. 
 
 బీజేపీతోనే తెలంగాణలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెబుతూ తెలంగాణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ అర్థం చేసుకుందని మోదీ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని ధ్వజమెత్తారు. స్కీముల పేర్లు చెప్పి స్కామ్‌లకు పాల్పడిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని మోదీ విమర్శించారు. 
 
తెలంగాణ ఏర్పడక ముందు ప్రజల కోసం పని చేస్తానని చెప్పిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పాటయ్యాక కుటుంబం కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఆదాయం పెంచుతానని చెప్పి తన కుటుంబ ఆదాయాన్ని కోట్లకు పెంచుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.