రైతుబంధు నిధుల పంపిణీకి ఎన్నికల సంఘం బ్రేకులు

* హరీష్‌ వ్యాఖ్యలతోనే దుమారం

రైతుబంధు పంపిణీకి ఈసీ ఇచ్చిన అనుమతిని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఏదో ప్రయోజనం కోరి చివరి వరకూ రైతుబంధును పంపిణీ చేయకుండా నిలిపివేస్తే.. ఈలోగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసేసుకుంది. 
 
ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అయితే సీఈసీ నిబంధనలు ఉలంగించినందుకు అనుమతి రద్దు చేసింది. ఈసీ అనుమతివ్వడంతో నవంబరు 28న రైతుల ఖాతాల్లో నగదును జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసీ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం కావడంతో పెద్ద ఎత్తున విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
 
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలపై నిషేధం విధించాలని పలు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. రైతు బంధు, దళిత బంధు వంటి పథకాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందనే విమర్శలు ఎదురయ్యాయి. 
 
మరోవైపు నాలుగేళ్లుగా యాసంగి పంటల కోసం రైతు బంధు పంపిణీ చేస్తున్నందున ఈ ఏడాది కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. ఎన్నికల షెడ్యూల్‌ను ఉల్లంఘించకుండా ఈ నెల 24 నుంచి రైతు బంధును పంపిణీ చేస్తామంటూ ఈ నెల 18న సీఈసీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 
 
ఇది ఇప్పటికే కొనసాగుతున్న పథకమని, కొత్తది కానందున అనుమతి ఇవ్వాలని విన్నవించింది. దీంతోపాటు రైతు రుణ మాఫీ, ఉద్యోగుల కరువు భత్యాల (డీఏ) అమలుకు అనుమతించాలని కోరింది. శుక్రవారం రైతు బంధు పంపిణీకి సీఈసీ ఓకే చెప్పింది. రుణ మాఫీ, ఉద్యోగుల డీఏలపై ఎలాంటి ఆదేశాలు రాలేదు.
 
తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీకి లబ్ది చేకూర్చేందుకు ఎన్నికల సంఘం నిధుల పంపిణీకి అనుమతించిందనే విమర్శల నేపథ్యంలో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రైతు బంధు నిధుల పంపిణీకి జారీ చేసిన అనుమతులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో గత ఐదేళ్లుగా అక్టోబర్- నవంబర్ మధ్య కాలంలో రైతు బంధు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని, అయితే దీనిని అమలు చేయడానికి నిర్ధిష్టమైన షెడ్యూల్‌ ఏది లేదని పేర్కొన్నారు.
రైతు బంధు పథకంలో ఏ తేదీల్లో ప్రభుత్వ సాయాన్ని విడుదల చేస్తారనేది స్పష్టత లేదని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబర్‌లోనే నిధులు విడుదల చేయాలనే నిబంధన ఎక్కడా లేదని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో తెలిపింది.  నవంబర్ 25న జారీ చేసిన ఉత్తర్వుల్లో రైతు బంధు నిధుల పంపిణీకి అభ్యంతరం లేదని పేర్కొన్నామని వివరించారు.
ఈ నెల 26వ తేదీన మంత్రి హరీష్‌ రావు రైతు బంధు నిధుల విడుదల చేస్తున్నట్లు చేసిన ప్రకటనలను పరిగణలోకి తీసుకుని అనుమతులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి హరీష్ రావు పోటీ చేస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేశారని ఈసీ అభిప్రాయపడింది. అమలులో ఉన్న ప్రభుత్వ పథకం నిధుల విడుదలను ప్రచారం చేయడం ద్వారా మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎంసిసి ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తూ రైతుబంధు నిధుల విడుదలకు గతంలో జారీ చేసిన అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నంలోగా తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే, ఈ నెల 28తో ప్రచార ఘట్టం ముగుస్తుంది. అంటే ఇవాళ మాత్రమే రైతుబంధు పంపిణీకి ప్రభుత్వానికి అనుమతి ఉంది.

ఈలోపే రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి నిరాకరించింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 29, 30 తేదీల్లో పంపిణీకి అనుమతి లేదని వివరించింది. దీనికి తగినట్లు రైతుబంధును డీబీటీ పద్ధతిలో జమచేస్తామని తెలిపింది. ఎందుకోగానీ డీబీటీ పద్ధతిలో జమ చేస్తామన్న ప్రభుత్వం చేయకుండా తాత్సారం చేసింది. దీంతో ఫిర్యాదులు వెళ్లడం.. అనుమతి నిరాకరించడం చకచకా జరిగిపోయాయి.