బెయిల్ రద్దు పిటిషన్ పై జగన్, సీబీఐలకు `సుప్రీం’ నోటీసులు

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన టిషన్ ను సుప్రీంకోర్టులో శుక్రవారం జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ విచారించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

గత పదేళ్లుగా జగన్‌ బెయిల్‌‌పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌‌లో రఘురామ కోరారు. జగన్ బెయిల్ ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని రఘురాజు తరపు న్యాయవాది ధర్మాసనంకు తెలిపారు. జగన్ తోపాటు, సీబీఐ, ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్ లో రఘురాజు కోరారు. దీన్ని పిటిషన్ కు జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఇంకోవైపు బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురాజు న్యాయవాది కోర్టును కోరారు.

సాక్ష్యాలు చెరిపేస్తున్నారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై వివరాలు లిఖితపూర్వకంగా కోర్టుకు రఘురామ తరుపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ అందించారు. జగన్‌కు బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 

ఇదే వ్యవహారంలో కేసు ట్రయల్‌ను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని తాము దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌ ఉందని, దానిలో ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ తెలిపారు. సీబీఐ కేసుల విచారణ తరువాతే ఈడీ కేసుల విచారణ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ కూడా ఇటీవల సుప్రీంకోర్టులో సవాలు చేసిన అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

ఈడీ దాఖలు చేసిన పిటీషన్ కూడా జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం ముందే పెండింగ్‌లో ఉందని కూడా బాలాజీ శ్రీనివాసన్ ప్రస్తావించారు. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టును కోరారు.

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌ను 2022 అక్టోబరు 28న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోందని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌‌పై ఉన్న జగన ట్రయల్ కోర్టు ముందు హాజరుకాకుండా శాశ్వత మినహాయింపు పొందారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. 

కేసు దర్యాప్తు ప్రారంభం అయ్యి పదేళ్లయినా అభియోగాల నమోదు జరగకపోయినా దర్యాప్తు సంస్థ సంతోషంగా మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తోందని పిటిషన్‌లో ఆరోపించారు. ఇవే విషయాలను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నప్పటికి పరిగణనలోకి తీసుకోకుండా కొట్టివేసిందని రఘురామ తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సీబీఐ ఇంతవరకూ సుప్రీంకోర్టులో సవాలు చేయలేదని రఘురామ వెల్లడించారు.

 మరోవంక, ఎంపీ రఘురామ సుప్రీం కోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో ఆలస్యం అవుతోందని, జగన్ కేసును 3071 సార్లు సీబీఐ కోర్టు వాయిదా వేసినట్లు పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ కేసుల విచారణ సందర్భంలో జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందని, వందల కొద్ది డిశ్చార్జి పిటిషన్లు వేసినట్లు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. సీఎం జగన్ కేసుల్లో జాప్యం ఎందుకు జరగుతోందని ప్రశ్నించింది. ఆలస్యానికి కారణాలు ఏంటో చెప్పాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐతో పాటుగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేవించిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జనవరికి వాయిదా పడింది.