మరణ శిక్ష కేసులో భారత్ అప్పీల్‌ను స్వీకరించిన ఖతర్‌ కోర్టు

గూఢచర్యం ఆరోపణలతో ఖతార్‌ కోర్టు 8 మంది భారతీయులకు  మరణ శిక్ష విధించిన విషయం విదితమే. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో అక్కడి కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. భారత్ అప్పీల్ ను ఖతార్ కోర్టు ఆమోదించింది.   అప్పీల్ పై తాము అధ్యయనం చేస్తున్నామని తదుపరి విచారణ త్వరలో జరుగుతుందని కోర్టు గురువారం పేర్కొంది. 
త్వ‌ర‌లోనే ఆ కేసు విచార‌ణ తేదీని కోర్టు ప్ర‌క‌టించ‌నున్న‌ది. దీంతో వారికి విధించిన మరణ శిక్షను మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.  గూఢ‌చ‌ర్యం కింద ఖ‌తార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆగ‌స్టు 2022లో 8 మందిని అరెస్టు చేసింది. కానీ ఖ‌తార్ ప్ర‌భుత్వం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ఆరోప‌ణ‌లు చేయ‌లేదు. ఈ కేసుకు సంబంధించి విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది.
‘‘కోర్టు తీర్పు గోప్యంగా ఉంచారు. అయితే, ఈ కోర్టు తీర్పును మా లీగల్ టీంతో పంచుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని పరిశీలించాక అప్పీలు ఫైల్ చేశాం. ఖతరీ అధికారులతో టచ్‌లో ఉన్నాం’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.  నిర్బంధించిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందికి మరణశిక్ష విధిస్తూ ఖతార్‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు అక్టోబర్‌లో తీర్పు ఇచ్చింది.
అరెస్టు అయిన‌వారిలో క‌మాండ‌ర్ పూర్ణేందు తివారి, క‌మాండ‌ర్ సుగుణాక‌ర్ పాకాల‌, క‌మాండ‌ర్ అమిత్ నాగ్‌పాల్‌, క‌మాండ‌ర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ న‌వ‌తేజ్ సింగ్ గిల్‌, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వ‌ర్మ‌, కెప్టెన్ సుర‌భ్ వాసిత్‌, సెయిల‌ర్ రాగేశ్ గోపాకుమార్ ఉన్నారు. అరెస్టు అయిన నేవీ అధికారులు అంద‌రూ దాదాపు 20 ఏళ్ల పాటు స‌ర్వీస్‌లో ఉన్నారు. ఈ తీర్పు అనంతరం భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది. 
వీరిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ కూడా ఉన్నారు.  ఖతార్ తీర్పుతో భారత్‌ దిగ్భ్రాంతికి గురైందని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని గతంలో విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. వారిని విడిపించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా బాధిత కుటుంబాలను కలిశారు. 
 
ఖతార్ అధికారులతో తాము టచ్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా న్యాయపరంగా కేసును ఎదుర్కునేందుకు అప్పీల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. కేసు సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుని అనవసర వదంతులు సృష్టించవద్దని  కోరారు. భారత్ కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహ్రా సంస్థలో పని చేస్తున్నారు. 
 
ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్ కు చెందిన ఓ మాజీ వైమానిక దళాధికారి నిర్వహిస్తున్నారు.  సబ్ మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని బంధించినట్లు అధికారులు తెలిపారు. కస్టడీలో ఉండగానే పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. నిర్బంధాన్ని పొడిగిస్తూ పోయిన కోర్ట చివరకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.