కేసీఆర్‌ను గజ్వేల్‌, కామారెడ్డిల్లో ఓడించేది బీజేపీయే

 
* ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కిషన్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌, కామారెడ్డిల్లో ఓడించేది బీజేపీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సర్వేల్లో కూడా ఇది వెల్లడైందని చెప్పారు. తమకు, తమ ప్రత్యర్థులకు వంద స్థానాల్లో పోటాపోటీ ఉందని థెయ్ల్పారు. కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌, మరి కొన్నిచోట్ల కాంగ్రెస్‌ తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నాయని చెప్పారు. 

విస్పష్ట మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రాబోతోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బందిపోట్ల తరహాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికే వేల కోట్ల దోపిడీ చేశారని, రాష్ట్ర ప్రజలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కుక్కలు తినేటోడు పోతే నక్కలు తినేటోడు వస్తాడని హెచ్చరించారు. 

కుక్కయినా.. నక్కయినా.. రెండూ దొంగలేనని బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలనుద్దేశించి ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటి కాదని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే తమపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నాయంటూ కాంగ్రెస్‌ నేతలు సిగ్గువిడిచి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు:

ఎన్నికలపై మీ అంచనాలు ఏమిటి?

విస్పష్ట మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నాం. బీఆర్‌ఎస్‌ ఓడిపోతోంది. చాలాచోట్ల కాంగ్రె్‌సకు డిపాజిట్లు గల్లంతు కాబోతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ఓటర్లు ఏకమవుతున్నారు. వాళ్లు ప్రచారానికి వెళితే నిలదీస్తున్నారు. వారి ప్రచార రథాలను ఊళ్లలోకి రానివ్వడం లేదు. 

ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అవినీతి, కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని నిశ్చయించుకున్నారు. అండగా నిలిచేందుకు సంఘటితమవుతున్నారు. డిసెంబరు 3న బీసీ ముఖ్యమంత్రిని చూడబోతున్నాం.

అంత ధీమాకు కారణం!

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది బీజేపీకే సాధ్యమని గుర్తించారు. ఆ పార్టీలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే ఎంత దోపిడీ జరుగుతుందో.. ఎంత నియంతృత్వం ఉంటుందో.. ఎంత అరాచకం జరుగుతుందో కళ్లారా చూశారు. కాంగ్రె్‌సది భస్మాసుర హస్తం. బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా యువత, నిరుద్యోగులు నిశ్శబ్ధ విప్లవంలా స్పందిస్తున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఘటనే ఇందుకు ఒక ఉదాహరణ.

వాస్తవంగా ఎన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు?

వంద స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని భావిస్తున్నాం. కొన్నిచోట్ల కాంగ్రెస్‌ మాకు ప్రధాన ప్రత్యర్థి అయితే మరి కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌. కేసీఆర్‌ కుటుంబం పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది. కేటీఆర్‌ను సీఎంగా చూడాలన్నది కేసీఆర్‌ చిరకాల స్వప్నం. దానికోసం ఆయన ఏదైనా చేస్తారు. ఎంతకైనా వెళతారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనన్న వాదన విస్తృతంగా ప్రచారంలో ఉంది. కాంగ్రెస్‌ కూడా దీనిపై ముమ్మరంగా ప్రచారం చేస్తోంది కదా!

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని నేను లక్ష ఆధారాలు చూపిస్తా. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనేందుకు ఒక్క ఆధారం చూపించమనండి. ఏ ప్రాతిపదిక లేకుండా గాలికి అనేస్తే ఎలా? బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయలేదా? కలిసి ప్రభుత్వంలో లేరా? రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌ మద్దతివ్వలేదా?

పార్లమెంటులో కలిసి పనిచేశాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కేసీఆర్‌ మంత్రిగా పని చేయలేదా? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని బీఆర్‌ఎ్‌సకు అమ్ముడుపోలేదా? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌ కొనలేదా? అసలు కేసీఆర్‌ ఒరిజినల్‌ కాంగ్రెస్‌ వాది కాదా? ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.

అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేయదని పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఆ విషయం మీరెలా చెబుతారు!?

కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు అది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ పెట్టిన ఏ మేనిఫెస్టో కూడా అమలు చేయలేదు. కర్ణాటకలో ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ సర్కారుపై వ్యతిరేకత వచ్చింది. హామీలను, గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని, క్షమించాలంటూ అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలే రోడ్లపైకి వచ్చి చెబుతున్నారు. 

ఇక, ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం బాగోలేదు. కాంగ్రెస్‌ వస్తే మరింత గందరగోళమవుతుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ తెచ్చిన అప్పులపై వడ్డీలు కూడా కట్టలేని దుస్థితి. అందుకే, ఆ పార్టీ గ్యారంటీలను అమలు చేసే పరిస్థితి ఉండబోదు. బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుకు డబుల్‌ ఇంజిన్‌ సర్కారే పరిష్కారం.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్‌ వాళ్లు ఫాల్తుగాళ్లు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేటోళ్లు. ఐటీ, ఈడీలకు, బీజేపీకి ఏం సంబంధం? వాళ్లు చేస్తున్న ఆరోపణ వందకు వంద శాతం తప్పు. తప్పు చేయకపోతే ఈడీ, ఐటీలు ఎందుకు దాడులు చేస్తాయి? మీ ఇళ్లల్లో కట్టల కట్టలు డబ్బులు ఎలా దొరుకుతున్నాయి. నోట్ల కట్టలు దొరికిన కొంతమంది కాంగ్రెస్‌ నేతలు నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ చెబితే, మాకేం సంబంధం?

కాళేశ్వరం కంటే కూడా ధరణి భారీ స్కామని ఎలా ప్రకటిస్తారు!?

బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ఉన్నవారి భూములు.. పేదలు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉంటున్నవారి భూములు, అసైన్డ్‌ భూములను ధరణిలో ప్రభుత్వ భూములని, వివాదాస్పద భూములని ప్రకటించారు. వాటికి మళ్లీ యాజమాన్య హక్కులు కల్పించాలంటే భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. 

ధరణిని అడ్డుపెట్టుకుని విపక్ష నేతలను బెదిరించి బీఆర్‌ఎ్‌సలోకి చేర్చుకుంటున్నారు. అందుకే కాళేశ్వరం కంటే ధరణి పెద్ద స్కాం. మేం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి రైతులకు అనుకూలమైన విధానాన్ని అమల్లోకి తీసుకు వస్తాం.

ఎన్నికల హామీల విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కంటే బీజేపీ కొంత వెనకబడిందన్న వాదన ఉంది.. మీ అభిప్రాయం?

ఆచరణ సాధ్యం కాని హామీలను బీజేపీ ఇవ్వదు. ఏవి ఇవ్వగలుగుతామో వాటినే చెప్పాం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల్లా ఓట్ల కోసం హామీలివ్వం. ప్రజలను మభ్యపెట్టం.

మీ పార్టీ ప్రధాన నినాదాల్లో ఒకటైన బీసీ సీఎం అన్నది.  ఎస్సీ వర్గీకరణ అంశంతో పోలిస్తే ప్రజల్లోకి ఆశించిన మేర వెళ్లలేదన్న అభిప్రాయం ఉంది.

సాక్షాత్తూ ప్రధాన మంత్రే ప్రకటించిన తర్వాత ఎందుకు వెళ్లదు? ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వాళ్లే క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో కొంత త్వరగా ప్రజల్లోకి వెళ్లింది. బీసీల్లో అనేక కులాలు ఉంటాయి. అందుకే అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎక్కడికక్కడ సదస్సులు కూడా పెడుతున్నాం.

ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో మీకు అతి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంపై ఏమంటారు!?

అది కరెక్టు కాదు. దక్షిణ తెలంగాణలో కూడా మాకు సీట్లు వస్తాయి.

బీజేపీ మినహా అన్ని పార్టీల అధ్యక్షులూ పోటీలో ఉన్నారు. మీరెందుకు పోటీ చేయడం లేదు!?

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి, ప్రజలకు ఏమిటి సంబంధం? పోటీ చేయకపోతే ఏమిటి సమస్య? మా పార్టీ నేతలు సంజయ్‌, ఈటల, రఘునందన్‌, అర్వింద్‌ వంటి వాళ్లు పోటీచేస్తున్నారు. నేను ఇప్పటికే ఎన్నికైన ఎంపీని.