హైదరాబాద్ మెట్రో రైలు త్వరలో అమ్మకానికి?

 
* మహిళలకు ఉచిత బస్సౌకర్యంతో పడకేసున్న మెట్రో!
 
హైదరాబాద్‌కు మణిహారంగా చెప్పుకొనే మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు ఎల్‌ అండ్‌ టీ సంస్థ ప్రెసిడెంట్‌, శాశ్వత డైరెక్టర్‌, సీఎఫ్‌వో ఆర్‌ శంకర్‌ రామన్‌ స్వయంగా ప్రకటించారు. 2026 తర్వాత విక్రయానికి సంబంధించిన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. 
 
మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి’ స్కీమ్‌ కారణంగానే హైదరాబాద్‌ మెట్రో నిర్వహణ నుంచి వైదొలుగుతున్నట్టు ఆయన తేల్చి చెప్పారు. ‘ఫ్రీ’ బస్సు స్కీమ్‌ పథకంతో మెట్రో ఆదాయానికి గండిపడిందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో మెట్రో రైళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
 
‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న ‘మహాలక్ష్మి’ పథకంతో మహిళలు బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. మెట్రో రైలు తక్కువగా ఎక్కుతున్నారు. పురుషులు రూ.35 చార్జితో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇది బాధాకరం. రాష్ర్టానికి ఆర్థిక భారం..’’ అని శంకర్‌రామన్‌ తెలిపారు.
 
 ‘ఫ్రీ’ బస్సు స్కీమ్‌తో తెలంగాణ ఆర్టీసీ కూడా దివాళా తీసే దుస్థితి రావొచ్చని హెచ్చరించారు. ఈ మేరకు ఇంగ్లీష్‌ వార్తాఛానల్‌ ‘బిజినెస్‌ టుడే’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ మెట్రోలో ప్రస్తుతం రోజుకు 4.80 లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. రానున్న రోజుల్లో 10 లక్షల సంఖ్యకు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అందులో చెప్పారు.

బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండటంతో మహిళలు ఎవరూ మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపించట్లేదు. రద్దీకి తగినట్టు బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచట్లేదు. బస్సుల్లో సీట్లు దొరకని పురుషులు మాత్రమే మెట్రో ఎక్కుతున్నారు. లేడీస్‌ కంపార్ట్‌మెంట్లు అన్నీ దాదాపుగా ఖాళీగానే కనిపిస్తున్నాయి. క్యాబ్‌ సర్వీసులు పెరుగడం కూడా మెట్రోపై ప్రభావం చూపిస్తున్నది.

మెట్రో నిర్వహణ కోసం తమకు ప్రభుత్వంతో 65 ఏళ్ల పాటు రాయితీ ఒప్పందం ఉందని, 2021 నుంచి 2026 వరకు సంస్థ పనితీరుపై కూలంకషంగా నివేదికను పొందుపర్చామని, రానున్న ఐదేళ్లకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. నష్టం వచ్చే ప్రాజెక్టుల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని, లాభాలు వస్తున్న ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని చెప్పారు.
 
 ప్రస్తుతం మెట్రో ఇన్‌ఫ్రా మొదటి లెవల్‌ డెవలప్‏మెంట్‌ పూర్తయిందని, రానున్న రెండేళ్లలో మరో దశ డెవల్‌పమెంట్‌ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తున్నారు.. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోంది.. అని ఆయన అభిప్రాయపడ్డారు.
 
 కరోనా సమయంలో కూడా శంకర్‌రామన్‌ ఎల్‌అండ్‌టీ వాటాలపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. నష్టాలతో హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్ట్‌ను నడుపుతున్నామని, ఆసక్తి కలిగిన వారు వస్తే కొంత వాటాను ఇస్తామని అప్పట్లో ఆయన ప్రకటన చేసినట్లు సమాచారం. తాజాగా ఫ్రీ బస్సు పథకంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వంతో కలిపి నడిపిస్తున్న ప్రాజెక్టుపై ఆయన చేసిన ప్రకటనలు సరికావని హెచ్‌ఎంఆర్‌ అధికారులు తోసిపుచ్చుతున్నారు.

నిజానికి బస్సులకు ప్రతీ 5 ఏండ్లకు ఒకసారి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ‘ఫ్రీ’ ప్రయాణాన్ని కల్పించుకొంటూ పోతుంటే బస్సుల మెయింటెనెన్స్‌కు డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  కాలుష్యంలేని, ఆధునిక రవాణా వ్యవస్థలపై (మెట్రో సర్వీసులు) ప్రైవేటు సంస్థలు తమ డబ్బును ఖర్చు పెడుతుంటే.. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న బస్సుల్లో ప్రజలు ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం డబ్బును వెదజల్లుతున్నది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదనే విమర్శలు చెలరేగుతున్నాయి.