మొదటి టీ20లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన భారత జట్టు ఆ ఓటమి నుంచి త్వరగానే బయటపడింది. సీనియర్ల గైర్హాజరీలో యువ జట్టుతో బరిలోకి దిగిన యంగ్‌ ఇండియా కంగారూలపై కొంతలో కొంత ప్రతీకారం తీర్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగిన మొదటి టీ20లో భారత్‌ 2 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. 

బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా భారత జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్‌ యాదవ్‌ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. 

జోస్‌ ఇంగ్లిస్‌ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్వితీయ సెంచరీతో కదంతొక్కగా, స్టీవ్‌ స్మిత్‌ (41 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ముఖేశ్‌ కుమార్‌ (0/29) పొదుపుగా బౌలింగ్‌ చేయగా, తక్కిన వాళ్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమ్‌ఇండియా సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసింది. సమన్వయ లోపంతో రుతురాజ్‌ గైక్వాడ్‌ (0) ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే వెనుదిరగగా, యశస్వి జైస్వాల్‌ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. కొత్త కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలతో కదంతొక్కారు. 

తెలంగాణ కుర్రాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (12; 2 ఫోర్లు) ఎక్కువసేపు నిలువలేకపోగా, ఆఖర్లో తీవ్ర ఒత్తిడిని అధిగమించి రింకూ సింగ్‌ (14 బంతుల్లో 22 నాటౌట్‌; 4 ఫోర్లు) మిగిలిన పని పూర్తిచేశాడు. ఆసీస్‌ బౌలర్లలో తన్వీర్‌ సంఘా రెండు వికెట్లు పడగొట్టగా, ముగ్గురు భారత బ్యాటర్లు రనౌట్‌ అయ్యారు. సూర్యకుమార్‌ యాదవ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం తిరువనంతపురంలో రెండో టీ20 జరగనుంది.

ఈ క్రమంలోనే టీమిండియా అనేక రికార్డులను నమోదు చేసింది. టీ20లలో టీమిండియాకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన కావటం విశేషం. 2019లో హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారతజట్టు 207 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. ఇదే సమయంలో టీ20లలో అత్యధిక సార్లు 200 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా కూడా ఇండియా నిలిచింది.
 
 టీమిండియా ఇప్పటివరకూ టీ20లలో ఐదుసార్లు 200 ప్లస్ స్కోరును ఛేదించింది. ఆస్ట్రేలియా మీద రెండు సార్లు, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్ మీద ఒక్కోసారి 200 పరుగులకు పైగా స్కోరును ఛేదించింది. సౌతాఫ్రికా నాలుగుసార్లు, పాకిస్థాన్, ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌లలో 200 ప్లస్ స్కోరును ఛేజ్ చేశాయి.
మరోవైపు టీ20లలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడు లేదా అంతకంటే దిగువన వస్తూ అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానానికి చేరాడు. 120 సిక్సులతో ఇయాన్ మోర్గాన్ తొలి స్థానంలో ఉండగా.. 106 సిక్సులతో కోహ్లి రెండు, 105 సిక్సులతో మిల్లర్ మూడో స్థానాల్లో ఉన్నారు. వంద సిక్సర్లతో ఈ జాబితాలో సూర్య నాలుగోస్థానానికి చేరుకున్నాడు. 99 సిక్సర్లతో కీరన్ పొలార్డ్ తర్వాతి ప్లేసులో ఉన్నాడు.