కుటుంబ పాల‌న నుంచి విముక్తియే బిజెపి లక్ష్యం

తెలంగాణ‌ను కుటుంబ పాల‌న నుంచి విముక్తం చేయ‌డ‌మే బిజెపి లక్ష్య‌మ‌ని, ఈ విముక్తి ఈ ఎన్నిక‌ల‌తో సాధిస్తామ‌ని జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేయసారు. నిజామాబాద్, సంగారెడ్డిలలో గురువారం బిజెపి నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. 
 
తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ వంచించారని పేర్కొంటూ కుటుంబ పాలన నుండి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించిన విషయాన్నిగుర్తు చేసిన ఆయ‌న తెలంగాణలో కూడ కుటుంబ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి లేదని మండిపడ్డారు.
 
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో కుటుంబ పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ కుటుంబంతోనే కాదు దేశంలోని కుటుంబ వారసత్వ పాలకులపై పోరాటం చేస్తామని జేపీ నడ్డా హెచ్చరించారు. కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డితో పాటు దేశంలోని కుటుంబ పాలనకు ముగింపు పలకాలని పిలుపిచ్చారు.
 
 కెసిఆర్ క‌మిష‌న్ల కోసం ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారని అంటూ దళితబంధులో ప్రజా ప్రతినిధులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపు రేఖలను మారుస్తామని నడ్డా హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ది చెందిందని ఆరోపించారు.
 
సీఎం కేసీఆర్ తెలంగాణని అభివృద్ధి చేయడం కంటే రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తీసుకెళ్లారని నడ్డా ధ్వజమెత్తారు. ‘‘కల్వకుంట్ల కుటుంబం దోపిడీ తెలంగాణలో సాగుతోంది. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో భారీ అవినీతి జరుగుతుంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ అంటున్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తాం.బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి. ధరణితో పేదల భూములను కేసీఆర్ ప్రభుత్వం గుంజుకుంది’’ అని నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానన్న హమీతో పాటు అనేక హమీలను కేసీఆర్ తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ కేసీఆర్ ఆక్రమణలకు పోర్టల్‌గా మారిందని నడ్డా ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కి ఏటీఎంగా మారిందని, దళితబందు లాంటి పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేసీఆర్ ఊహా లోకంలో కట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటించారు. దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి.. అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం’ అని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ హయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని నడ్డా ధ్వజమెత్తారు.