బర్రెలక్కకు భద్రత కల్పించమని హైకోర్టు ఆదేశం

కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క  అలియాస్ కర్నె శిరీష వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి ఆమెకు భద్రత కల్పించాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు రక్షణ కల్పించాల ని,ఆమె నిర్వహించే బహిరంగసభలకు ఒక గన్‌మెన్‌తో భద్రత ఇవ్వాలని పోలీస్ శాఖకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 
 
ఎన్నికల్లో కేవలం గుర్తింపు ఉన్న పార్టీల నాయకులకే భద్రత ఇస్తేనే సరిపోదని,ముప్పు ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు కూడా రక్షణ కల్పించాలని ఆదేశించింది. అభ్యర్థుల భద్రత, బాధ్యత ఎన్నికల సంఘానిదేనని న్యాయస్థానం తెలిపింది. అభ్యర్థుల భద్రతపై డీజీపీ, ఈసీ కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఈ నెల 21వ తారీఖున కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో బర్రెలక్క తమ్మునిపై కొందరు దుండగులు దాడి చేశారు. దానితో తనకు 2+2 గన్‌మెన్లతో భద్రత కల్పించాలని కోరుతూ బర్రెలక్క హైకోర్టులో పిటిషన్ వేసింది. 
 
పోలీసులను కోరినా భద్రత కల్పించట్లేదని ఆమె ఫిర్యాదు చేసింది. పోటీ నుంచి తప్పుకోవాలంటూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.  స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్కకు అటు సోషల్ మీడియాతో పాటు క్షేత్రస్థాయి ప్రచారంలోనూ పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. బర్రెలక్క మీద జరిగిన దాడి గురించి తెలుసుకుని స్వచ్ఛందంగా పలువురు న్యాయవాదులు కూడా ముందుకు రావటం విశేషం.

నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న బర్రెలక్కకు కేవలం యువత నుంచే కాకుండా  అన్ని వర్గాల నుంచి పార్టీలకతీతంగా మద్దతు లభిస్తోంది. సామాన్యునికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయల గురించి.. సగటు నిరుద్యోగి బాధల గురించే ప్రచారంలో ప్రస్తావిస్తూ.. అందరినీ ఆలోచింపజేస్తోంది బర్రెలక్క.

ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా.. దాడులు జరిగినా.. పోలీసులు రక్షణ కల్పించకపోయినా.. మొక్కవోని ధైర్యంతో.. తనతో కలిసి నడుస్తున్న యువతే కొండంత అండగా ముందుకు సాగుతోంది.