ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆదేశం

ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తామని ఇటీవలే ప్రకటించిన ప్రధానినరేంద్ర  మోదీ తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం కేబినెట్‌ సెక్రెటరీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఈ విషయమై అధికారులతో సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై కీలక సూచనలు చేసినట్లు ప్రభుత్వ వర్గాల మేరకు తెలిసింది.  ఇటీవలే హైదరాబాద్ వేదికగా ఎమ్మార్పీఎస్ మాదిగల విశ్వరూప పేరుతో భారీ సభను నిర్వహించింది. ఈ సభకు ఏకంగా ప్రధాని మోదీ  హాజరై ఎస్సీ వర్గీకరణ ఉద్యమంతో పాటు పలు అంశాలను ఈ సభలో ప్రస్తావించారు. 

ఈ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తామని, ఇందుకోసం ఉన్నత కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గటే సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ అధికారులకు పలు సూచనలు చేశారు. దీంతో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ రాబోయే రోజుల్లో అధికారికంగానే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దశాబాద్ధాల కాలం పాటు ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ పోరాడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ఉంది. మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని ఎమ్మార్పీఎస్ అనేక ఉద్యమాలను ముందుండి నడిపించింది.

ప్రదాని మోదీ ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా ఉంటామని ప్రకటించిన ఎమ్మార్పీఎస్ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తోంది. స్వయంగా మందకృష్ణ మాదిగ పలు కార్యక్రమాలకు హాజరవుతూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

తెలంగాణలో ఇప్పటికే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన బీజేపీ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆయా సామాజికవర్గాలకు మరింత దగ్గర కావాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది.