90 శాతం నష్టాలతో ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో పెట్టుబడులందుకు?

స్టాక్ మార్కెట్ లో కంపెనీలలో షేర్లు కొనడం ద్వారా లాభాలు ఆర్జించే ప్రయత్నం చేయడం కాకుండా ఇటీవల కాలంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా విపరీతంగా లాభాలు ఆర్జించాలనే ఉబలాటం పెరుగుతూ ఉండటం పట్ల మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్ విస్మయం వ్యక్తం చేశారు. 
 
వాస్తవానికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసేవారిలో దాదాపు 90 శాతం మంది నష్టాలను మూటకట్టుకుంటున్నట్లు వెల్లడైంది. దీంతో అనేక మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ డబ్బును కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు ఎందుకు వీటిలో పెట్టుబడి కోసం ఆత్రుతపడుతున్నారో తెలియటం లేదని, ఈ ధోరణిని చూసి తాను ఆశ్చర్యపోవటంతో పాటు అయోమయానికి లోనయ్యాయని ఆమె తెలిపారు.
 
దీర్ఘకాలిక పెట్టుబడులు, రాబడులపై ఇన్వస్టర్లు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మాధబి సూచించారు. ఈ వ్యూహం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులను పెట్టుబడిదారులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆసియాలోని పురాతన స్టాక్ మార్కెట్ బిఎస్ఇలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్(ఐఆర్ఆర్ఎ) ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన సందర్భంగా బుచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఫ్యూచర్ ట్రేడింగ్ కేటగిరీలో ట్రేడింగ్ చేస్తున్న 45.24 లక్షల మంది ఇన్వెస్టర్లలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలను పొందుతున్నట్లు ఇటీవల చేసిన పరిశోధన గణాంకాలు స్పష్టం చేశాయి. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కేటగిరీలో ట్రేడింగ్ చేస్తున్న వారి సంఖ్య ఏకంగా 500 రెట్లు పెరిగినట్లు రీసెర్చ్ వెల్లడించింది. 
 
నష్టాల నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాలపైపు మెుగ్గుచూపాలని మాధబి బుచ్ అభ్యర్థించారు. ప్రధానంగా ఫ్యూచర్ ట్రేడింగ్ కేటగిరీలో ట్రేడింగ్ చేస్తున్న వారిలో మూడోవంతు మంది 20-30 ఏళ్ల వయస్సు మధ్యవారే ఉన్నారని వెల్లడైంది.  ఒక వ్యాపారి అతని లేదా ఆమె బ్రోకర్ అంతరాయాన్ని ఎదుర్కొన్న సందర్భంలో  ఐఆర్ఆర్ఎని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌తో ఎస్ఎంఎస్ ను పొందుతారు. రెండు గంటలలోపు ఓపెన్ పొజిషన్‌లను స్క్వేర్-ఆఫ్ చేయగలరని బుచ్ వెల్లడించారు.