తెలంగాణలోనే భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం జోరందుకుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు నగదు, మద్యం పంపి ణీ చేయకుండా ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టి ఎక్కడక్కడే తనిఖీల చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీ మొత్తంలో నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది.

ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి సుమారు రూ. 1,760 కోట్లకు పైగా విలువైన ఉచిత వస్తువులు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను సీజ్ చేసినట్లు ఈసీఐ సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 9న ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి లభ్యమైన ఈ మొత్తం 2018లో ఇవే రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం కంటే ఏడు రెట్లు(630 శాతం) ఎక్కువని పోల్ ప్యానెల్ వెల్లడించింది.

2018లో ఎన్నికల సంఘం రూ. 239.15 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది. నవంబర్ 30న ఎన్నికల జరగాల్సిన తెలంగాణలో అత్యధికంగా రూ. 659.2 కోట్ల నగదు పట్టుబడగా, రాజస్థాన్‌లో రూ. 650.7 కోట్లు, మధ్యప్రదేశ్‌లో రూ. 323.7 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 76.9 కోట్లు, మిజోరంలో రూ. 49.6 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

ఈ సారి టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకుని పటిష్టమైన నిఘాను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. మిజోరాంలో 29.82 కోట్ల విలువైనా డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోల్ ప్యానెల్ వివిధ సేవలకు చెందిన 228 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది.