నేషనల్ హెరాల్డ్ కేసులో రూ. 751.90 కోట్ల ఆస్తులు జప్తు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ.751.9 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది.  మరోవైపు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలతోపాటు ప్రస్తుత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌లను ఇదివరకే విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.
 
నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి 2014లో కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి ఈడీ అప్పట నుంచి దీన్ని దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి కాంగ్రెస్‌కు చెందిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్‌ సంస్ధలపై దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను తాజాగా  జప్తు చేసింది.
 
ముంబై, లక్నోలోని వీరికి చెందిన ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు.  యంగ్ ఇండియా సంస్ధతో సహా ఏడుగురు నిందితులు నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, మోసం, నిజాయితీ లేని ఆస్తుల దుర్వినియోగం, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు పాల్పడ్డారని ఢిల్లీ కోర్టు గతంలో నిర్ధారించింది.  యంగ్ ఇండియన్ ద్వారా ఏజేఎల్‌కు చెందిన వందల కోట్ల ఆస్తులు సంపాదించేందుకు కుట్ర జరిగినట్లు తేలింది.
వార్తాపత్రికలను ప్రచురించడానికి రాయితీ ధరలకు భూమిని పొందిన ఏజేఎల్ సంస్ధ..2008లో తన కార్యకలాపాలను నిలిపేసింది. ఆ తర్వాత వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ ఆస్తులను వాడుకుంది. దీంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి ఏజేఎల్ సంస్ధ రూ.90 కోట్ల అప్పు చెల్లించాల్సి వచ్చింది. కానీ ఈ అప్పు చెల్లించలేని పరిస్దితిలో ఏజేఎల్ ఉందని చూపించి కాంగ్రెస్ పార్టీ దీన్ని మరో కొత్త సంస్ధ యంగ్ ఇండియాలో విలీనం చేసింది. ఇందుకు గాను 50 లక్షలు చెల్లించింది. 
 
దీంతో ఏజేఎల్ వాటాదారుల్ని కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు మోసం చేశారని కోర్టు నిర్ధారించింది. కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ ను యంగ్ ఇండియాకు ఇచ్చేశాక పాత రుణం చెల్లించాలని, లేదా ఏజేఎల్ షేర్లు కేటాయించాలని కోరింది. దీంతో ఏజేఎల్ సంస్ధ ఓ అత్యవసర సమావేశం నిర్వహించి వాటా మూలధనం పెంపుతో పాటు యంగ్ ఇండియాకు తాజాగా రూ.90.21 కోట్ల విలువైన షేర్ల జారీకి తీర్మానం చేసింది. 
 

ఈ తాజా షేర్ల కేటాయింపుతో వెయ్యి కంటే ఎక్కువ మంది వాటాదారుల వాటా కేవలం 1 శాతానికి తగ్గించారు. అలాగే ఏజేఎల్ కూడా యంగ్ ఇండియా అనుబంధ సంస్థగా మారింది. అలాగే యంగ్ ఇండియా ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ కూడా తెచ్చుకుంది. ఇందులో అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) దిల్లీ, ముంబయి, లఖ్‌నవూర్  నగరాల్లో రూ.661.69 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. దీంతోపాటు ఏజేఎల్‌లో ఈక్విటీ షేర్ల రూపంలో యంగ్‌ ఇండియన్‌ రూ.90.21కోట్లు కలిగి ఉందని తెలిపింది.